Diabetic: మధుమేహంతో గుండెకు ముప్పు

మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెకు మధుమేహ వ్యాధి పెను విపత్తును తెచ్చిపెడుతోంది. అదుపు తప్పిన మధుమేహం అడుగడుగునా

Published : 27 Jun 2021 01:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెకు మధుమేహ వ్యాధి పెను విపత్తును తెచ్చిపెడుతోంది. అదుపు తప్పిన మధుమేహం అడుగడుగునా గుండెకు అవాంతరాలు కలిగిస్తోంది. మధుమేహం వల్ల రక్తనాళాల్లో ఆటంకాలు, ఛాతిలో నొప్పి, తీవ్రమైన గుండెపోటు సంభవించే అవకాశం ఉంది. ప్రాణాంతకమైన ఈ విపత్తు వెనుక రక్తంలో అదుపు తప్పిన చక్కెర నిల్వలే కారణమని చెబుతున్నారు వైద్యులు. ఈ సందర్భంగా వయసు పెరిగే కొద్దీ మధుమేహం గుండెకు ముప్పుగా ఎలా పరిణమిస్తుంది? షుగర్‌ దాడి నుంచి గుండెను కాపాడుకోవడానికి ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పలు అంశాల గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డా.రమేష్‌ గూడపాటి మాటల్లో..     

డయాబెటిక్‌ హార్ట్‌ డిసీజ్‌ అంటే ఏంటి? 
మధుమేహం వల్ల గుండెలో తలెత్తే సమస్యను డయాబెటిక్‌ హార్ట్‌ డిసీజ్‌ అంటారు. దీని వల్ల గుండెలోని కండరాలు గట్టి పడటం లేదా బలహీనపడటం జరుగుతుంది. దీన్ని డయాబెటిక్‌ కాడియోమయోపతి అంటారు. ఎప్పుడైతే గుండెలోని కండరాలు పనిచేయడం మానేస్తాయో.. అప్పుడు గుండెలో ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ఊపిరితిత్తుల్లోకి నీరు చేరుతుంది. అలాగే కొందరిలో గుండెకు రక్తం చేరవేసే నరాల్లో అడ్డంకులు ఏర్పడతాయి.  దానివల్ల సాధారణ వ్యక్తుల్లో కంటే వీళ్లలో గుండెపోటు వచ్చే అవకాశం రెట్లు అధికంగా ఉంటుంది. 

మధుమేహం మూలంగా గుండెకు ఎలాంటి సమస్యలు వస్తాయి?
మధుమేహంతో బాధపడేవాళ్లలో కొంతమందికి ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కొంతమందిలో అయితే గుండె పోటు వచ్చిందన్న విషయం వైద్య పరీక్షల్లో కూడా తెలియదు. కాబట్టి మధుమేహం ఉన్న వాళ్లు శరీరంలో కొత్తగా ఏవైనా సమస్యలు గుర్తించినట్లయితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 

మధుమేహంతోపాటు గుండెకు సమస్యల్ని పెంచే ఇతర రిస్కు ఫ్యాక్టర్స్ ఏంటి?
మధుమేహం వల్ల ప్రధానంగా రక్తపోటు, అధిక బరువు సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో మంచి కొవ్వు తగ్గి, చెడు కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. మధుమేహం వల్ల ఏర్పడే సమస్యలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చక్కెర స్థాయిలను, మధుమేహం వల్ల వచ్చిన ఇతర సమస్యలను ముందుగానే గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకుంటే గుండె సమస్యలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. 

డయాబెటిక్‌ హార్ట్‌ డిసీజ్‌కు చికిత్స ఎలా ఉంటుంది?
మధుమేహం ఉన్న వాళ్లకు ఈసీజీ, ఎకో కార్డియోగ్రామ్‌, ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌ చేయడం ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను గుర్తిస్తారు. ఈ పరీక్షల వల్ల రక్తనాళాల్లోని పూడికలను గుర్తించడానికి వీలవుతుంది. వాటిని సరిచేసుకుని, మందులు వాడటం ద్వారా గుండెపోటు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా ఈ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

మధుమేహం బారి నుంచి గుండెను కాపాడుకునేందుకు ఏం చేయాలి?
దీర్ఘకాలికంగా మధుమేహంతో బాధపడుతున్న వాళ్లలో గుండె సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మధుమేహం ఉన్న వాళ్లలో యుక్త వయసులో కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్లు చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకోవాలి. మధుమేహంతో పాటు, బీపీ, అధిక బరువు వంటి ఆరోగ్య సమస్యలు వీలైనంత తగ్గించుకొనే ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ.. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఫైబర్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలు, పాల సంబంధిత పదార్థాలు, తీపి పదార్థాలు తీసుకోవడం వీలైనంత తగ్గించుకోవాలి. జంక్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే గుండెకు సంబంధించిన సమస్యలను చాలావరకూ రాకుండా చూసుకోవచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని