Text Neck: వాళ్లలో మెడనొప్పికి కారణం ఇదే!

ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు. కానీ ఇప్పుడు సెల్‌ఫోన్‌ హస్తభూషణంగా మారింది.

Updated : 19 Jun 2021 12:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు. కానీ ఇప్పుడు సెల్‌ఫోన్‌ హస్తభూషణంగా మారింది. నేడు అందరి దగ్గరా సెల్‌ఫోన్లు కనిపిస్తున్నాయి. సెల్‌ఫోన్‌ చేతిలో లేనిదే ఎవరికీ ఏమీ తోచడం లేదు. పక్కవాళ్ల ఫోన్‌ మోగినా తమ ఫోన్‌ మోగుతుందేమోనని చూసుకునే వాళ్లే అందరూ. ఏ పని చేస్తున్నా పదినిమిషాలకు ఒకసారైనా ఫోన్‌ చూడకపోతే ఏదో కోల్పోయినట్టు భావిస్తుంటారు. చాలామంది సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి చాటింగ్‌ చేస్తూ గడిపేస్తున్నారు. దీనివల్ల కొత్తరకమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

18 నుంచి 45 ఏళ్ల వయసున్న వారంతా ఇంటా బయటా అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఫోన్‌ వాడుతున్నట్టు అనేక సర్వేలు వెల్లడించాయి. ఈ వయసువాళ్లు మెలకువగా ఉన్న సమయంలో కేవలం రెండు గంటలు మాత్రమే ఫోన్‌కు దూరంగా ఉంటున్నారని పరిశోధనల్లో తేలింది. సెల్‌ఫోన్‌ను అస్తమానం చూసే క్రమంలో నిరంతరాయంగా తల వంచి టైప్‌ చేస్తూ ఉండటంవల్ల మెడలో సమస్యలు వస్తున్నాయి. దీన్నే వైద్యులు టెక్ట్స్‌ నెక్‌ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తున్నారు. అదే పనిగా మెడను వంచి చేతివేళ్లతో టైప్‌ చేయడంవల్ల భుజం లాగడం, వేళ్లు తిమ్మిర్లు ఎక్కడం, వెన్నెముక పైభాగంలో నొప్పి కలుగుతుందని, సమస్య తీవ్రమైతే శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుందనీ వైద్యులు అంటున్నారు.

టెక్ట్స్‌ నెక్‌ సిండ్రోమ్‌ రాకుండా ఉండాలంటే సెల్‌ఫోన్‌ను సాధ్యమైనంత దూరంగా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైన సందర్భాల్లో ఫోన్‌ ఎక్కువసేపు వినియోగించాల్సి వస్తే మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి. అలాగే కంప్యూటర్‌, టాబ్లెట్‌, ఫోన్‌ వాడేటపుడు మెడ నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తలను కిందకు వంచకుండా వీలైనంత వరకూ ఫోన్‌ని కంటికి ఎదురుగా పెట్టుకొని మాత్రమే టైప్‌ చేయాలి. ముఖ్యంగా గంటల తరబడి చాటింగ్‌ చేయడం మానుకోవాలి. అలాగే అవసరమైనప్పుడే ఫోన్‌ ఉపయోగించడం వల్ల శారీరక, సాంఘిక సమస్యలకు దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు