Health: ముఖంలో కరెంటు షాక్‌ కొడితే ఎలా ఉంటుందో తెలుసా

చిన్నగా కరెంటు షాక్‌ కొడితేనే ఒళ్లంతా ఒక్కసారిగా కంపించిపోతుంది.  దాని గురించి ఆలోచించాలంటేనే భయం వేస్తుంది

Published : 21 Apr 2022 14:20 IST

ఇంటర్నెట్‌డెస్క్: స్వల్పంగా కరెంటు షాక్‌ కొడితేనే ఒళ్లంతా ఒక్కసారిగా కంపించిపోతుంది. దాని గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఇలాంటి షాక్‌లు ముఖంలో తరచుగా వచ్చి పోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ముఖంలోని ఫెషియల్‌ నరం దెబ్బతిన్నపుడు ముఖంలో తరచుగా షాక్‌ కొట్టినట్టు అనిపిస్తుంది. ఈ షాక్‌నే ట్రైజెమినల్‌ న్యూరాల్జియాగా చెబుతారు. దీనికి గల కారణాలు, పరిష్కారమార్గాలను న్యూరోఫిజిషియన్‌ సుబ్బయ్య చౌదరి పేర్కొన్నారు.

ఏంటది..ఎందుకిలా: మెదడు నుంచి శరీరంలోని అన్ని భాగాలకు ఎన్నో నరాలుంటాయి. అందులో ఒకటి ట్రైజెమినల్‌ నరం ముఖానికి స్పందన తీసుకొస్తుంది. ఈ నరం దెబ్బతిన్నపుడు కత్తితో పొడిచినట్టు, కరెంటు షాక్‌ కొట్టినట్లు అనిపిస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత నొప్పి ఉన్నా.. మళ్లీ మళ్లీ అలాగే రావొచ్చు. కొంతమందికి చల్లగాలి తగిలినా, చల్లని నీటిని తాగినా, బ్రష్‌ చేసినా, ఏదైనా నములుతున్నపుడు నొప్పి తీవ్రంగా ఉంటుంది. కొంతమంది పంటినొప్పి అనుకుంటారు. కానీ, ఇది ట్రైజెమినల్‌ నరంతో వచ్చేదే.. నరం ఒత్తిడికి గురయినపుడుగానీ కంతుల ప్రభావంతో నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇది ఎక్కువగా చెంపలు, దవడ భాగంలోనే వస్తుంది. పురుషుల కంటే మహిళల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. 

పరీక్షలు ఏవీ: ఎంఆర్‌ఐ స్కాన్‌ చేసిన తర్వాత ఏ కారణంతో వస్తుందో తెలుసుకోవచ్చు. ఎంఆర్‌ఐ బ్రెయిన్‌ బేసల్‌కట్‌, ఎంఆర్‌ యాంటియో బ్రెయిన్‌ పరీక్షలు చేసి రక్తనాళాలలోని తేడాలను ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేస్తారు.

మందులతోనే నయం: చాలా మందికి మందులతోనే నయం చేయడానికి వీలుంది. ట్యూమర్‌ ఉన్నట్లయితే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. మందులతో కోలుకోకపోతే ఆపరేషన్‌కు వెళ్లాల్సి వస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని