Chandrababu Arrest: రెండ్రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు

రెండ్రోజుల పాటు చంద్రబాబును సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

Updated : 22 Sep 2023 19:13 IST

అమరావతి: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. రెండ్రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబును అయిదు రోజుల కస్టడీకి  ఇవ్వాలని సీఐడీ కోరగా... న్యాయమూర్తి రెండ్రోజుల విచారణకు అనుమతించారు. రాజమహేంద్రవరం జైలులోనే చంద్రబాబును విచారణ చేయాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

విచారణ అధికారుల పేర్లు ఇవ్వాలని, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారణకు అనుమతించారు. విచారణ జరుపుతున్న వీడియో, ఫొటోలు విడుదల చేయరాదని షరతులు విధించారు. ఆదివారం సాయంత్రం కస్టడీ ముగిశాక వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ్‌ అగర్వాల్‌ వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని