Pakistan: నీళ్లకు బదులు యాసిడ్‌.. రెస్టారంట్‌ మేనేజర్‌ అరెస్ట్‌!

పుట్టిన రోజు వేడుకలకు వాటర్‌ బాటిళ్లలో నీళ్లకు బదులు యాసిడ్‌ అందజేసిన ఘటన పాకిస్థాన్‌లోని ఓ రెస్టారంట్‌లో చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ఓ బాలుడికి కాలిన గాయాలు కాగా, మరొక చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది.

Published : 04 Oct 2022 18:18 IST

ఇస్లామాబాద్‌: పుట్టిన రోజు వేడుకలకు వాటర్‌ బాటిళ్ల(Water Bottles)లో నీళ్లకు బదులు యాసిడ్‌(Acid) అందజేసిన ఘటన పాకిస్థాన్‌(Pakistan)లోని ఓ రెస్టారంట్‌లో చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ఓ బాలుడికి కాలిన గాయాలు కాగా, మరొక చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రెస్టారంట్‌(Restaurant) మేనేజర్‌ను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. లాహోర్‌(Lahore)లోని చారిత్రక గ్రేటర్‌ ఇక్బాల్‌ పార్క్‌లో ఉన్న ‘పోయెట్ రెస్టారంట్’లో ఇటీవల మహమ్మద్‌ ఆదిల్‌ కుటుంబం.. పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు వచ్చింది. ఈ క్రమంలో అక్కడి సిబ్బంది వారికి నీళ్ల సీసాలు అందజేశారు.

అందులోని ఒక నీళ్లసీసాతో ఆదిల్‌ మేనల్లుడు అహ్మద్ చేతులు కడుక్కొన్నాడు. కొద్దిసేపటికే అతను ఏడుపు మొదలుపెట్టాడు. అతని చేతులపై కాలిన గాయాలయ్యాయి. దీంతో వాటర్‌ బాటిల్‌లో నీళ్లకు బదులు యాసిడ్‌ అందజేసినట్లు గుర్తించారు. అప్పటికే మరో బాటిల్‌లోని యాసిడ్‌ తాగడంతో.. అతని మేనకోడలు, రెండున్నరేళ్ల వాజిహా వాంతులు చేసుకుంది. వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆదిల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు రెస్టారంట్ మేనేజర్ మహమ్మద్ జావేద్‌, మరో ఐదుగురు సిబ్బందిపై కేసు నమోదు చేశారు. జావేద్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు రెస్టారంట్‌ను మూసివేసినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని