టన్నెల్‌ వద్ద తనవారి కోసం వెతుకుతున్న ‘బ్లాకీ’

ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఆకస్మిక వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. అక్కడ సొరంగాల్లో చిక్కుకుపోయిన వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆచూకీ తెలియని కార్మికుల బంధువులు తపోవన్‌

Published : 18 Feb 2021 01:46 IST

చమోలీ: ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఆకస్మిక వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. అక్కడ సొరంగాల్లో చిక్కుకుపోయిన వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆచూకీ తెలియని కార్మికుల బంధువులు తపోవన్‌ సొరంగం బయట తమవారి కోసం ఎదురు చూస్తున్నారు. వారితో పాటు ఒక బ్లాకీ అనే ఓ శునకం కూడా చాలా రోజులుగా సొరంగం బయటే తచ్చాడుతోంది. అక్కడి సిబ్బంది ఎన్నిసార్లు దానిని దూరంగా పంపుతున్నా, తిరిగి అక్కడికే వచ్చి చేరుతోంది. అసలు విషయం తెలుసుకున్న అధికారులు శునకం విశ్వాసానికి అబ్బురపడుతున్నారు. ఈ విషయం గురించి తెలుపుతూ ఓ ఐఎఫ్‌ఎస్‌ అధికారి ట్విటర్‌లో వీడియోను పోస్టు చేశారు.

వివరాల్లోకెళ్తే.. రెండేళ్ల వయసున్న బ్లాకీ అనే శునకం తపోవన్‌ టన్నెల్‌ సమీపంలో ఉండేది. అక్కడ పనిచేస్తున్న కొందరు కార్మికులు తాము తెచ్చుకున్న ఆహారంలో రోజూ దానికి కొంత పెట్టేవారు. దీంతో కార్మికులకు ఆ శునకం ఎంతో విశ్వాసంగా ఉండేంది.   కార్మికులు సొరంగం లోపల పని చేసుకొనే వరకూ అక్కడే ఉండి సాయంత్రం తర్వాత వెళ్లిపోయేది. ‘‘వరదలు వచ్చిన రోజు బ్లాకీ అక్కడ లేదు. మరుసటి రోజు తిరిగొచ్చేసరికి తనకు రోజూ ఆహారం పెట్టే వాళ్లు దానికి కనిపించలేదు. దీంతో రోజూ ఆ ప్రాంతం వద్దే  వారికోసం చూస్తోందని, వరద ప్రమాదం నుంచి బయటపడిన రాజిందర్‌ కుమార్‌ అనే కార్మికుడు తెలిపారు. అసలు విషయం తెలిసిన తర్వాత అధికారుల హృదయం ద్రవించింది అని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుండటంతో బ్లాకీ అందరి హృదయాలను దోచుకుంటోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని