Top Ten News @ 1PM

దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. 4లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 4,12,262 మందికి కొవిడ్ సోకింది. 24 గంటల్లో 3,980 మంది కరోనా చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Updated : 06 May 2021 13:12 IST

1. Coronavirus: ఒక్కరోజులో 4లక్షలు దాటిన కేసులు

దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. 4లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 4,12,262 మందికి కొవిడ్ సోకింది. 24 గంటల్లో 3,980 మంది కరోనా చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజులో 3,29,113 మంది కోలుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* TS Covid: 6,026 కొత్త కేసులు

2. కేరళలో Lockdown

కేరళలో భారీ మొత్తంలో కరోనా కేసులు నమోదవుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి 16 వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా విజయన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గట్లేదన్నారు. కొవిడ్‌ కట్టడికి లాక్‌డౌన్‌ తప్పట్లేదని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. జంతువుల ద్వారా కరోనా సోకదు

కరోనా వైరస్‌ మనుషుల నుంచి మనుషులకే సోకుతుంది తప్ప... జంతువుల ద్వారా సోకదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ చెప్పారు. వైరస్‌ తొలిసారి విజృంభించిన తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ప్రజల్లో రోగనిరోధక శక్తి తక్కువ కావడం వల్లే... మహమ్మారి రెండో దశ అనివార్యమైందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్‌సింగ్‌ కన్నుమూత

కరోనా బారిన పడి మరణిస్తున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా.. రాష్ట్రీయ లోక్‌ దళ్‌(ఆర్‌ఎల్‌డీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్‌(82) కన్నుమూశారు. గత నెల 20న కరోనా బారిన పడిన ఈయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ కుమారుడైన అజిత్‌సింగ్‌ రాజ్యసభ, లోక్‌సభ సభ్యుడిగానూ పని చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. యూపీఏ పగ్గాలు మమతకు ఇవ్వాలి

పశ్చిమ బెంగాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. భాజపాయేతర పార్టీల్లో ఆమె హవా పెరిగింది. ఆమెను యూపీఏ కూటమి ఛైర్‌పర్సన్‌గా గానీ కన్వీనర్‌గా గానీ ఎంపిక చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌లోని ఒక వర్గం నేతలు కూడా దీనికి మద్దతు పలుకుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరుల హతం

జమ్ముకశ్మీర్‌లో ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లా కనిగాం ప్రాంతంలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య ఈ కాల్పులు జరిగాయి. ముష్కరులు ఉన్నారనే సమాచారంతో వారిని చుట్టుముట్టిన జవాన్లు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా.. తౌనిఫ్‌ అహ్మద్‌ అనే ఉగ్రవాది లొంగిపోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. టీకా పేటెంట్‌పై భారత్‌కు అమెరికా మద్దతు..!

కొవిడ్‌ టీకా పేటెంట్ల మినహాయింపుపై చేస్తున్న పోరాటంలో భారత్‌కు అత్యంత కీలక భాగస్వామి నుంచి మద్దతు లభించింది. కొవిడ్‌ టీకాకు పేటెంట్ల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వాదనకు బుధవారం అమెరికా  మద్దతు పలికింది. పేద దేశాల ప్రజలు ప్రాణాలు నిలుపుకొనేందుకు అవసరమైన టీకాల లభ్యత పెంపుపై ఈ అంశం ఆశలు పెచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. IPL సెప్టెంబర్లో! 3 వేదికలపై చర్చ?

నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌-2021ను మళ్లీ ఎప్పుడు నిర్వహించాలన్న చర్చ మొదలైంది. సీజన్‌ మలిదశ పూర్తి చేసేందుకు సరైన సమయం, వేదిక గురించి బీసీసీఐ, ఐపీఎల్‌ పాలక మండలి మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ఇతర దేశాల క్రికెట్‌ షెడ్యూళ్లను అనుసరించి సెప్టెంబర్లో రెండో దశను నిర్వహిస్తే బాగుంటుందని బోర్డు పెద్దలు భావిస్తున్నారట. యూఏఈ, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలో ఏదో ఒక చోటికి వేదికను మార్చాలని అనుకుంటున్నట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. Facebook: ట్రంప్‌ ఖాతా స్తంభన సబబే

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాను స్తంభింపజేయడాన్ని ఫేస్‌బుక్‌కు చెందిన స్వతంత్ర పర్యవేక్షక సంస్థ- ‘ఓవర్‌సైట్‌ బోర్డ్‌’ సమర్థించింది. కేపిటల్‌ భవంతిపై ట్రంప్‌ అనుచరులు జనవరిలో దాడి చేసిన తర్వాత ఆయన ఖాతాను ఫేస్‌బుక్‌ సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి బుధవారం బోర్డు మద్దతు తెలిపింది. హింసకు అవకాశమిచ్చే తీవ్ర పరిస్థితులను ట్రంప్‌ ఆరోజు తీసుకువచ్చారని, ఖాతాను నిలిపివేయడం సరైన చర్య అని బోర్డ్‌ డైరెక్టర్‌ థామస్‌ హ్యూజ్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. స్వల్పంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

ఇంధన ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్‌కు లీటర్‌పై రూ.25 పైసలు, డీజిల్‌పై రూ.31 పైసలు పెరిగింది. గుంటూరులో ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ రూ.97.16 పైసలు కాగా.. డీజిల్‌ ధర రూ.90.81 పైసలుగా ఉంది. ప్రీమియం పెట్రోల్‌ రూ.100.61గా ఉంది. విజయవాడలో లీ.పెట్రోల్‌ రూ.96.90 పైసలు, డీజిల్‌ రూ.90.61 పైసలుగా ఉంది. ప్రీమియం పెట్రోల్ రూ.100.41 పైసలుగా విక్రయిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని