Top Ten News @ 1 PM

దేశంలో కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. 4 లక్షలకుపైగా రోజువారీ కేసులు, 4 వేలకు చేరువగా మరణాలు నమోదవడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,14,188 కొత్త కేసులు నమోదయ్యాయి. 4 లక్షలకుపైగా కేసులు చోటుచేసుకోవడం దేశంలో ఇది

Updated : 07 May 2021 13:04 IST

1. Corona : మూడోసారి 4 లక్షలు దాటిన కేసులు

దేశంలో కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. 4 లక్షలకుపైగా రోజువారీ కేసులు, 4 వేలకు చేరువగా మరణాలు నమోదవడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,14,188 కొత్త కేసులు నమోదయ్యాయి. 4 లక్షలకుపైగా కేసులు చోటుచేసుకోవడం దేశంలో ఇది మూడోసారి. ఇక మరణాలు వరుసగా పదో రోజు 3 వేలకుపైగా నమోదయ్యాయి. తాజాగా కొవిడ్‌తో పోరాడుతూ 3,915 మంది మరణించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* TS Corona: ఒక్కరోజులో 46మంది మృతి

2. Sagam Dairy: జీవో నిలిపేసిన హైకోర్టు

సంగం డెయిరీ వ్యవహారంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. డెయిరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవోను ఉన్నత న్యాయస్థానం నిలుపుదల చేసింది. సంగం డెయిరీ డైరెక్టర్లు సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని.. డెయిరీ స్థిర, చరాస్తులను అమ్మాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* ఏలూరు ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

3. Covid: విరుష్క జోడీ విరాళాల సేకరణ 

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ.. కొవిడ్‌పై ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రకటించారు. దేశంలో ప్రజల బాధలు చూసి తీవ్ర ఆవేదన కలిగిందని విరాట్‌ అన్నారు. తన భార్య అనుష్క శర్మతో కలిసి తాను వైరస్‌పై పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కష్టకాలంలో కరోనాపై పోరాడుతున్న వారికి అండగా ఉందామని పిలుపునిచ్చారు. ketto వెబ్‌సైట్‌ ద్వారా విరాళాలు సమీకరించనున్నట్లు విరుష్క దంపతులు ఓ వీడియో ద్వారా ట్విటర్‌లో తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. వారంతా ద్రోహులు: కమల్‌ హాసన్‌

తమిళనాడులో కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం)లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజా ఎన్నికల్లో పార్టీ పరాభవం నేపథ్యంలో ఇప్పటికే పలువురు పార్టీని వీడగా.. తాజాగా పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్‌.మహేంద్రన్ సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌కు పలు కారణాలను వివరిస్తూ లేఖ రాశారు. మహేంద్రన్‌ రాజీనామాపై కమల్‌ హాసన్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన్ను ‘ద్రోహి’గా అభివర్ణించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* TamilNadu: సీఎంగా స్టాలిన్‌ ప్రమాణస్వీకారం

5. ఇంటి నుంచే కొవిడ్‌ను ఓడించడం ఎలా?

కొవిడ్‌ బారిన పడి హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటున్న వారికి వైద్యం అందించేందుకు అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్ర వైద్యులు ముందుకొచ్చారు. హెల్పర్‌ ఫౌండేషన్‌ ద్వారా వీరు కొవిడ్‌ రోగులకు టెలీ వైద్యం అందించనున్నారు. అందులో భాగంగా ఈనెల 5వ తేదీ నుంచి జూమ్‌ కాన్ఫరెన్సులు ప్రారంభించారు. ఈ నెల 23 వరకు ఇవి కొనసాగనున్నాయి. అమెరికాలోని పశ్చిమ వర్జీనియా, కాలిఫోర్నియా, వర్జీనియాలో ఫిజీషియన్‌లుగా పనిచేస్తున్న డా.హరీష్‌, డా.ధీరజ్‌, డా.అచ్యుత్‌ జూమ్‌ ద్వారా వైద్యం అందిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి 

6. Covid: ప్రపంచవ్యాప్తంగా 69 లక్షల మరణాలు! 

ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ కొవిడ్‌ మరణాలను తక్కువ చేసి చూపుతున్నట్లు వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం వేదికగా పనిచేస్తున్న స్వతంత్ర ప్రపంచ ఆరోగ్య పరిశోధన సంస్థ ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యూయేషన్‌ (ఐహెచ్‌ఎంఈ)’ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు కొవిడ్‌తో 69 లక్షల మంది చనిపోయి ఉంటారని ఈ సంస్థ అంచనా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. CoronaVaccine: అవగాహనకు ‘టీకా విమానం’

ప్రజల్లో టీకాపై భయాలున్నాయని.. ఆ భయాలను తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  గుజరాత్‌లోని సూరత్‌ కార్పొరేషన్‌ వినూత్న అవగాహనకు శ్రీకారం చుట్టింది. సిటీలోని అత్వాగేట్‌ సర్కిల్‌ వద్ద విమానం ఆకారంలో భారీ వ్యాక్సిన్‌ నమూనాను ఏర్పాటుచేసింది. టీకాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన భారీ ‘టీకా విమానం’ బొమ్మ విశేషంగా ఆకట్టుకుంటోంది. మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకోవాలంటూ ఆ బొమ్మ సూచిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. వరుసగా నాలుగో రోజు పెరిగిన చమురు ధరలు

కొద్ది రోజులపాటు స్థిరంగా ఉన్న చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 31 పైసల చొప్పున పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్‌ ధర రూ.91 దాటింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. HYD: 9 నిమిషాల్లో 12 కిలోమీటర్లు..

అత్యవసర పరిస్థితుల్లో ఓ రోగి ప్రాణాలు నిలిపేందుకు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్‌ అపోలో ఆసుపత్రికి అంబులెన్స్‌లో బాధితుడిని కేవలం 9 నిమిషాల్లో తరలించారు. ఇందుకోసం ట్రాఫిక్‌ పోలీసుల సహకారంతో గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు. 12 కిలోమీటర్ల దూరాన్ని 9 నిమిషాల్లో చేరవేసి ఆ బాధితుడికి సకాలంలో వైద్యం అందేలా చేశారు. పోలీసులు, వైద్య సిబ్బంది కృషిని పలువురు అభినందిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఒక అడుగు వెనక్కి తగ్గిన ఆస్ట్రేలియా..!

భారత్‌ నుంచి విమానాల రాకపోకలపై ఆస్ట్రేలియా విధించిన నిషేధంలో స్వల్ప సడలింపు లభించింది. గతంలో భారత్‌ నుంచి విమానాల రాకపోకలను మే15 వరకు నిషేధిస్తూ ఆ దేశం నిర్ణయం తీసుకొంది. ఒకవేళ ఎవరైనా వస్తే జైలుశిక్ష, జరిమానా తప్పదని ప్రధాని స్కాట్‌ మారిసన్‌  హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నిర్ణయంపై ఆస్ట్రేలియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.  దీంతో ఆయన తన నిర్ణయంపై కొంచెం వెనక్కి తగ్గారు. భారత్‌లో చిక్కుకుపోయి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న వారిని తిరిగి స్వదేశానికి తీసుకొస్తామని ప్రధాని స్కాట్‌ మారిసన్‌ శుక్రవారం ఉదయం వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని