Top Ten News @ 1PM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Updated : 19 May 2021 13:07 IST

1.  TSPSC: ఛైర్మన్‌ను నియమించిన ప్రభుత్వం

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)కి ఛైర్మన్‌, సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సీఎం కేసీఆర్‌ ప్రతిపాదనలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలిపారు. ఈ మేరకు  ఉత్తర్వులు జారీ అయ్యాయి. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా ప్రస్తుత వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి, సభ్యులుగా విశ్రాంత ఈఎన్సీ రమావత్‌ ధన్‌సింగ్‌, సీబీఐటీ ప్రొఫెసర్‌ బి.లింగారెడ్డి, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ కోట్ల అరుణకుమారి, ప్రొఫెసర్‌ సుమిత్రా ఆనంద్‌ తనోబా, ఆయుర్వేద వైద్యులు డాక్టర్‌ అరవెల్లి చంద్రశేఖర్‌రావు, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌. సత్యనారాయణలను ప్రభుత్వం నియమించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. Raghurama: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్‌ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా హైకోర్టు, మెజిస్ట్రేట్‌ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు నిలదీసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. Corona: మూడో రోజూ 3 లక్షలలోపు కేసులు

దేశంలో వరుసగా మూడో రోజు కొత్త కేసులు 3 లక్షల లోపు నమోదయ్యాయి. అయితే భారీ సంఖ్యలో మరణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 4,529 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. కొత్త కేసులు 3 లక్షలలోపే నమోదైనప్పటికీ.. క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. Corona.. మరణ మృదంగ‘మే’

4077, 4106, 4329, 4,529.. గత నాలుగు రోజులుగా దేశంలో నమోదైన కరోనా మరణాలివి. గత కొద్ది రోజులుగా దేశంలో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. వైరస్‌తో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో ఉంటుండం భయాందోళనలు రేపుతోంది. ఈ మృత్యుఘోష ఆగేదెప్పుడా అని యావత్ భారతావని ఆశగా ఎదురుచూస్తోంది. మరి కొత్త కేసులు, రికవరీలు ఊరటనిస్తున్నప్పటికీ.. మరణాలు ఎందుకు ఇంత భారీగా ఉంటున్నాయంటే.. దీనికి పలు కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. Covishield: ఎడం పెరిగినా పొరపాటు లేదోయ్‌!

‘కొవిషీల్డ్‌’ టీకా రెండు డోసుల మధ్య విరామాన్ని భారత ప్రభుత్వం క్రమంగా పెంచుకుంటూ వెళుతోంది. అందుకు భిన్నంగా బ్రిటన్‌ సర్కారు దీన్ని తగ్గిస్తోంది. దీంతో ఈ అంశంపై ప్రజల్లో గందరగోళం తలెత్తుతోంది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. రెండో డోసును ఆరు నెలలలోపు తీసుకున్నా.. అది సమర్థంగానే పనిచేస్తుందని భరోసా ఇస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. Corona: పిల్లలకు సోకినా తీవ్ర లక్షణాలు ఉండవు

చిన్నపిల్లలకు కరోనా సోకినా వారిలో తీవ్ర లక్షణాలు ఉండవని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ పేర్కొన్నారు. పిల్లల్లో పెద్ద లక్షణాలు ఉండవు కాబట్టి వారికి సాధారణ చికిత్స సరిపోతుందన్నారు. అయితే వైరస్‌ తన స్వభావాన్ని మార్చుకుంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుందని, అందువల్ల దానిపై కన్నేసి ఉంచాలన్నారు. తాము ఇప్పుడు అదే పనిలో ఉన్నామని.. వైరస్‌లోని మార్పులను అర్థం చేసుకొని ఎలా స్పందించాలో అలా స్పందిస్తామని పేర్కొన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. NTR: ఫ్యాన్స్‌కు తారక్‌ బహిరంగ లేఖ

అభిమానులకు ఎన్టీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. ఈ ఏడాది తన పుట్టినరోజు నాడు(మే 20) ఏవిధమైన వేడుకలు చేయవద్దని సూచించారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వేడుకలకు ఇది సరైన సమయం కాదని.. ప్రతిఒక్కరూ లాక్‌డౌన్‌ నియమాలు పాటించి ఇంటికే పరిమితం కావాలని కోరారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, త్వరలోనే కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటానని పేర్కొన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. Maharashtra: భారీగా పేలుడు ప‌దార్థాల స్వాధీనం

మ‌హారాష్ట్ర‌లోని ఠానే జిల్లాలో భారీగా పేలుడు ప‌దార్థాలు ప‌ట్టుబ‌డ్డాయి. భివాండీ సమీపంలోని గోదాముల్లో పోలీసులు ఈ ఉద‌యం సోదాలు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో అక్ర‌మంగా నిల్వ చేసిన పేలుడు ప‌దార్థాల‌ను గుర్తించారు. 12 వేల జిలెటిన్ స్టిక్స్‌, 3 వేల డిటోనేట‌ర్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్క‌డి నుంచి ఎవ‌రు తీసుకొచ్చి గోదాముల్లో దాచార‌నే దానిపై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

9. Tool Kit: భాజపా, కాంగ్రెస్‌.. ఓ టూల్‌కిట్‌ రగడ!

దేశంలో విజృంభిస్తున్న కొత్త రకం కరోనా వైరస్‌ను ‘ఇండియా స్ట్రెయిన్‌’, ‘మోదీ స్ట్రెయిన్‌’ అని పిలవడం ద్వారా విపక్ష కాంగ్రెస్‌ దేశ ప్రతిష్ఠతో పాటు ప్రధాని మోదీని దెబ్బతీసేందుకు యత్నిస్తోందని భాజపా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ప్రత్యేక ‘టూల్‌కిట్‌’ను రూపొందించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. దీనిపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. ‘నకిలీ టూల్‌కిట్‌’తో దుష్ప్రచారానికి పాల్పడుతున్నారంటూ భాజపా నేతలపై దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ వద్ద ఫిర్యాదు చేసింది. భాజపా అధ్యక్షుడు నడ్డా, ఆ పార్టీ నేతలు బి.ఎల్‌.సంతోష్, సంబిత్‌ పాత్రా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీలపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. సౌమ్య కుటుంబానికి ఇజ్రాయెల్‌ అధ్యక్షుడి పరామర్శ

ఇటీవల ఇజ్రాయెల్‌లోని అష్కెలాన్‌ నగరంపై హమాస్‌ చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్యా సంతోష్‌ కుటుంబీకులను ఆ దేశ అధ్యక్షుడు రెవెన్‌ రివ్లిన్‌  పరామర్శించారు. బుధవారం ఆయన కేరళలలోని సౌమ్య కుటుంబానికి ఫోన్‌ చేశారు. సౌమ్య మృతికి సంతాపం తెలిపారు. సౌమ్య కుటుంబంతో మాట్లాడిన విషయాన్ని రెవ్లిన్‌ సలహాదారులు ఒకరు ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని