Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Updated : 11 Jan 2022 17:24 IST

1. Eatala: ఈటల కుమారుడిపై కేసీఆర్‌కు ఫిర్యాదు

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుమారుడు నితిన్‌రెడ్డిపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు అందింది. తన భూమిని నితిన్‌ కబ్జా చేశారంటూ మేడ్చల్‌ మండలం రావల్‌కోల్ వాసి మహేశ్‌ ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ సీఎంకు విన్నవించుకున్నారు. మహేశ్‌ ఫిర్యాదు నేపథ్యంలో ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ ప్రారంభించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) విజిలెన్స్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

2. AP News: ఆనంద‌య్య మందుపై వైద్యుల చ‌ర్చ‌

నెల్లూరు జిల్లా కృష్ణ‌పట్నానికి చెందిన ఆనంద‌య్య మందుకు అనుమ‌తి వ‌స్తే ఆయుర్వేద ఫార్మ‌సీలో ఔష‌ధం త‌యారీకి తితిదే సిద్ధం అని తితిదే పాల‌క‌మండ‌లి స‌భ్యుడు చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి అన్నారు. వైద్యుల బృందంతో క‌లిసి ఆయుర్వేద ఔష‌ధం ప‌రిశీలించామ‌న్నారు. మందులో దుష్ఫ్ర‌భావ ప‌దార్థాలు లేవ‌ని వైద్యులు చెబుతున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఐసీఎంఆర్‌, ఆయుష్ నివేదిక‌ల కోసం వేచి చూస్తున్న‌ట్లు వివ‌రించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. TS News: ఫుడ్ డెలివ‌రీ సేవ‌లు యథాత‌థం

తెలంగాణ‌లో నేటి నుంచి ఫుడ్ డెలివ‌రీ, ఈ- కామ‌ర్స్‌ సేవ‌లు యథాత‌థంగా కొన‌సాగ‌నున్నాయి. అత్య‌వ‌స‌ర రాక‌పోక‌లు సాగించేవారిని అడ్డుకోబోమ‌ని డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ సీపీల‌కు ఆదేశాలు అందాయి. నిన్న హైద‌రాబాద్‌లో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌చ్చిన స‌మ‌యంలో ప‌లుచోట్ల ఫుడ్ డెలివ‌రీ బాయ్స్‌ను అడ్డుకొని, కొంద‌రి వాహ‌నాల‌ను సీజ్ చేయడంతో వారు ఆందోళ‌న చెందారు. ఈ విష‌యాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. AP Politics: సరిహద్దులో పంచాయితీలేంటి?:అచ్చెన్న

ఏపీ, తెలంగాణ సరిహద్దులో ప్రతిసారీ పంచాయితీలేంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తెలంగాణలో ప్రత్యేక చట్టాలు ఏమైనా అమలవుతున్నాయా? దేశంలో ఆ రాష్ట్రం అంతర్భాగం కాదా? అని ప్రశ్నించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సరిహద్దులోని గుంటూరు జిల్లా పొందుగుల వద్ద పోలీసుల లాఠీఛార్జి చేస్తున్నారని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. AP News: ఈ-పాస్‌ ఉంటేనే తెలంగాణలోకి..

ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో వాహనాల నిలిపివేతతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సరిహద్దులోని కృష్ణా జిల్లా గరికపాడు వద్ద ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. సూర్యాపేట జిల్లా రామాపురం చెక్‌పోస్ట్ వద్ద ఏపీ నుంచి వచ్చే వాహనాలు నిలిచిపోయాయి. కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా సూర్యాపేట జిల్లా సరిహద్దులో ఇవాళ్టి నుంచి ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. Corona : 2.5లక్షలకు దిగువన కొత్త కేసులు

దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతోంది. అయితే రోజువారీ కేసుల్లో తగ్గుదల కనిపిస్తుండటం కాస్త ఊరట కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 20 లక్షలకుపైనే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ.. కొత్త కేసుల సంఖ్య 3 లక్షలలోపే ఉంటోంది. గడిచిన 24 గంటల్లో 2,40,842 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. అంతక్రితం రోజు 4 వేలకుపైగా మరణాలు సంభవిస్తే.. తాజాగా 3,741 మంది ప్రాణాలు విడిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. Vaccine: ఒకే వ్యక్తికి వేర్వేరు టీకాలు ఇవ్వొచ్చా?

మనదేశంలో ప్రస్తుతం కొవిడ్‌-19 కు కొవిషీల్డ్, కొవాగ్జిన్‌తో పాటు ఇటీవల స్పుత్నిక్‌ వి టీకా అందుబాటులోకి వచ్చింది. ఇవన్నీ రెండు డోసుల టీకాలు. మొదటి డోసు తీసుకున్న 28 రోజులు, అంతకుమించిన గడువు తర్వాత రెండో డోసు టీకా తీసుకోవాలి. కానీ రెండో డోసు నాటికి అదే టీకా దొరకకపోతే.. బదులుగా వేరే టీకా అందుబాటులో ఉంటే, దాన్ని వేసుకోవచ్చా, అది పనిచేస్తుందా? దానివల్ల నష్టాలు ఏమైనా ఉంటాయా? ఇవి ఎంతో మందిలో వ్యక్తమవుతున్న సందేహాలు. ఇదే విషయాన్ని అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్‌-19 బృందం (వర్కింగ్‌ గ్రూపు) నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. Raghavendra rao:ఆయనో సినీ యూనివర్సిటీ

రంగుల రసవేదం.. ఇంద్రచాపం.. వెండితెరకెక్కిన ఒక్కో చలనచిత్రం ఒక్కో కళాఖండం.. తెలుగు చలనచిత్రరంగ చరిత్రలో దాదాపు అర్ధశతాబ్దం తనదేనని చాటిన ఆయన ఒక చరిత్ర. ఆయనే దర్శకేంద్రుడు. నవతరం దర్శకులకు ‘ఆదర్శ’కేంద్రుడు. కె. రాఘవేంద్రరావుగా సినీజగతికి సుపరిచితులైన కోవెలమూడి రాఘవేంద్రరావు. ఈ సినీచరిత్రకారుడు పుట్టినరోజు నేడు. ఒక చరిత్ర పుట్టిన రోజు. సినీరంగంలో చరిత్ర సృష్టికర్త జన్మించిన రోజు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. Vaccine: టీకా వేసుకుంటే బీరు ఉచితం!

సాధారణంగా ఏ దేశంలోనైనా ఎన్నికల వేళ ప్రజలను రాజకీయ పార్టీలు ‘ఉచిత’ హామీలతో ఆకట్టుకోవటం చూస్తుంటాం! కానీ అమెరికాలో ఇప్పుడు ఏ ఎన్నికలూ లేకున్నా ఉచిత పంపకాల కార్యక్రమం నడుస్తోంది. కారణం- కొవిడ్‌ టీకా! వ్యాక్సిన్లు వేసుకునేలా ప్రజల్ని ప్రోత్సహించటానికిగాను... ప్రభుత్వంతో పాటు ప్రైవేటు కంపెనీలూ అనేక ఉచిత హామీలు గుప్పిస్తున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోతీరుగా ఈ తాయిలాల వర్షం సాగుతోంది. మేలో వ్యాక్సిన్‌ వేసుకుంటే ఉచితంగా బీర్లు, వైన్‌ ఇస్తామని ఒకరంటే... మ్యూజియాలు, పార్కుల్లోకి ఉచిత ప్రవేశమని అని ఇంకొకరు... 50 లక్షల డాలర్ల లాటరీ టికెట్‌ ఉచితమని మరొకరు హామీ ఇస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. Sports News: వాళ్లను కలవడం వల్లే వైరస్‌ సోకి ఉండొచ్చు

ఐపీఎల్‌ బయోబుడగలో చెన్నై సూపర్ కింగ్స్‌ ఆటగాళ్లను కలవడం వల్లే తనకు కరోనా వైరస్‌ సోకి ఉండొచ్చని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌, కీపర్ వృద్ధిమాన్‌ సాహా అనుమానం వ్యక్తం చేశాడు. ఏప్రిల్‌ 28న ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరిగిందని, అప్పుడు తాను వారితో కలిసి మాట్లాడానని సాహా పేర్కొన్నాడు. తాజాగా ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ.. వారిని కలిసిన కొద్ది రోజులకే సీఎస్కే బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీకి వైరస్‌ నిర్ధరణ కాగా, అనంతరం తనకూ పాజిటివ్‌గా తేలిందని సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మన్‌ గుర్తు చేసుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని