
AIG Hospitals: 1,000 మంది హార్ట్ మార్షల్స్‌కు ఏఐజీలో శిక్షణ
హైదరాబాద్: దేశంలో ఏటా 7 లక్షల మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ముఖ్యంగా రక్తపోటు, ఒత్తిడి వల్ల ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. ఎలాంటి గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ వయసుతో సంబంధం లేకుండా కొందరిలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే, సడెన్ కార్డియాక్ అరెస్ట్ (ఎస్సీఏ) సంభవించిన వారికి వెంటనే సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేయడం ద్వారా ప్రాణాలు కాపొడొచ్చని పలు సందర్భాల్లో నిరూపితమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ వైద్యశాల ఏఐజీ హాస్పిటల్.. బేసిక్ లైఫ్ సపోర్ట్ (బీఎల్ఎస్)పై వెయ్యి మందికి శిక్షణ ఇచ్చింది. వివిధ హౌసింగ్ సొసైటీల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డులు, పోలీసు సిబ్బందికి సీపీఆర్ ఎలా చేయాలన్నదానిపై తర్ఫీదు ఇచ్చింది. హార్ట్ మార్షల్స్గా పిలిచే వీరి శిక్షణ పూర్తయిన నేపథ్యంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో బుధవారం సత్కరించారు.
ఈ సందర్భంగా ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణిస్తున్న ఉదంతాలు ఈ మధ్య బాగా పెరిగాయన్నారు. అలాంటి వారికి తక్షణమే సీపీఆర్ అందించాలన్న ఉద్దేశంతో నిత్యం అందుబాటులో ఉండే వెయ్యి మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చామన్నారు. రాబోయే ఆరు నెలల్లో 10 వేల మందికి ఇదే తరహాలో శిక్షణ ఇవ్వనున్నట్లు నాగేశ్వర రెడ్డి తెలిపారు. సీపీఆర్ అందివ్వడంలో ఎంత ఆలస్యం అయితే మరణముప్పు అంత ఎక్కువ పెరుగుతుందని ఏఐజీ వైద్యులు, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి. నరసింహన్ తెలిపారు.
ఒక నిమిషం ఆలస్యానికి 10 శాతం ముప్పు పెరుగుతుందన్నారు. సీపీఆర్ వల్ల ప్రాణాలు నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. కార్డియాక్ అరెస్ట్‌కు ముందు ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం, పాదాలు ఉబ్బడం, నీరసం వంటి లక్షణాలు కనిపించినా కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారని మరో వైద్యులు డాక్టర్ రాజీవ్ మేనన్ తెలిపారు. మధుమేహం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తర్వాతి దశలో పబ్లిక్ పార్కులు, మెట్రో, రైల్వే స్టేషన్లలో పనిచేసే గార్డులకు శిక్షణ ఇవ్వనున్నట్లు డాక్టర్ జీవీ రావు ఈ సందర్భంగా తెలిపారు.