HYD news: సందడిగా సాగిన ఎయిర్‌ షో.. చివరి రోజు పోటెత్తిన సందర్శకులు

బేగంపేట విమానాశ్రయంలో నాలుగు రోజుల పాటు సందడిగా సాగిన ఏవియేషన్‌ షో విజయవంతంగా ముగిసింది. ఈసారి సమ్మిట్‌ వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు, భారత్‌లో ఏవియేషన్ సెక్టార్‌ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలతో సాగింది.

Updated : 27 Mar 2022 21:04 IST

హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయంలో నాలుగు రోజుల పాటు సందడిగా సాగిన ఏవియేషన్‌ షో విజయవంతంగా ముగిసింది. ఈసారి సమ్మిట్‌ వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు, భారత్‌లో ఏవియేషన్ సెక్టార్‌ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలతో సాగింది. ఏవియేషన్ షోకు చివరి రెండ్రోజులు సందర్శకులు పోటెత్తారు. ఇవాళ చివరి రోజు కావటంతో పెద్ద ఎత్తున బేగంపేట విమానాశ్రయానికి నగరవాసులు తరలివచ్చారు.  

20కు పైగా దేశాలు, 8 రాష్ట్రాల నుంచి 5వేల మంది వ్యాపార ప్రతినిధులు, 60వేల మంది సందర్శకులు సందర్శించారు. నిన్న 22వేల మంది ఏవియేషన్‌ షోను తిలకించగా, ఇవాళ ఆదివారం చివరి రోజు కావడంతో 38వేల మంది నగరవాసులు ఎయిర్‌పోర్టుకు రావడంతో  ఆ ప్రాంగణమంతా సందర్శకులతో కిటకిటలాడింది. సారంగ్‌ టీమ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిర్‌ షో ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భిన్న ఫార్మేషన్స్‌తో ఎయిర్‌ ఫోర్స్‌ బృందం చేసిన విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. అయితే, ఎయిర్‌ షోను తిలకించేందుకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన అభిమానులను బారికేడ్ల అవలే వరకే అనుమతించడంతో నిరుత్సాహానికి గురయ్యారు. భిన్న రకాల ఎయిర్‌ క్రాఫ్ట్‌లను ఒక దగ్గర చూసేందుకు అవకాశం లభించడంతో హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పిల్లలు, గృహిణులు విమానాల ప్రదర్శన, ఎయిర్‌ షోను తిలకించడం కొంగొత్త అనుభూతిని మిగిల్చిందని ఆనందం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని