ట్రాలీ బ్యాగ్‌ వీల్‌ పోయింది.. ఎయిర్‌లైన్స్‌ను రూ.8వేలు కట్టమన్న కోర్టు..

ఓ ప్రయాణికుడి ట్రాలీకి సంబంధించిన చక్రం పోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎయిర్‌లైన్స్‌కు వినియోగదారుల కోర్టు రూ.8వేలు నష్టపరిహారం కట్టాల్సిందిగా తీర్పు వెలువరించింది.

Published : 26 Apr 2022 19:57 IST

బెంగళూరు: ఓ ప్రయాణికుడి ట్రాలీకి సంబంధించిన చక్రం పోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎయిర్‌లైన్స్‌కు వినియోగదారుల కోర్టు రూ.8వేలు నష్టపరిహారం కట్టాల్సిందిగా తీర్పు వెలువరించింది. నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం బెంగళూరుకు చెందిన రబి కుమార్‌ పథి ఈ కేసులో విజయం సాధించారు. 2017 జులైలో విశాఖపట్నం నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి(కేఐఏ) కుమార్‌ ప్రయాణించారు. అనంతరం తన లగేజ్‌ తీసుకునేందుకు కన్వేయర్ బెల్ట్‌ దగ్గరకు వెళ్లగా, తన ట్రాలీ బ్యాగుకు చెందిన ఒక చక్రం కనిపించకుండా పోయినట్లు గుర్తించాడు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేఐఏ గ్రౌండ్‌ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల తర్వాత ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ట్రాలీ చక్రాన్ని గుర్తించి కుమార్‌కు తెలిపారు.

విరిగిపోయిన చక్రాన్ని బాగు చేసేందుకు నిర్దేశిత బ్యాగు విక్రయదారుకు ఇవ్వాల్సిందిగా కుమార్‌ సూచించాడు. ట్రాలీ చక్రాన్ని బాగు చేసి ఇచ్చే క్రమంలో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. మూడు నెలల పాటు బ్యాగును తమ వద్దే ఉంచుకుని, మరమ్మతు చేసేందుకు సరైన స్పేర్‌పార్ట్స్‌ దొరకడం లేదని దుకాణ యజమాని చెప్పినట్లు కుమార్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు పరిహారంగా రూ.1000 చెల్లిస్తామని చెప్పారు. ఆ తర్వాత దాన్ని రూ.3వేలకు పెంచారు. ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది మూడు నెలల పాటు జాప్యం చేయడం పట్ల అసహనానికి గురైన కుమార్‌ వారికి లీగల్‌ నోటీస్‌ పంపాడు.

2017 నవంబరులో మొదటిసారి విచారణ సందర్భంగా సరైన ఆధారాలు లేని కారణంగా కేసు వాపసు తీసుకునేలా కుమార్‌ను ఆదేశించాలని ఎయిర్‌లైన్స్‌ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అందుకు కోర్టు సముఖత వ్యక్తం చేయలేదు. దీంతో విరిగిపోయిన చక్రం స్థానంలో కొత్తది వేసి ఇచ్చారు. అయితే అది వేరే రంగుది కావడంతో కేసు విచారణ కొనసాగింది. మళ్లీ కొన్నాళ్లకు నాలుగు చక్రాలు ఒకే రంగువి వేసి కుమార్‌కు అందించారు. చివరకు వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి రూ.5వేలు నష్టపరిహారం రూ.3వేలు కోర్టు ఖర్చులు కలిపి మొత్తం రూ.8వేల నష్టపరిహారం 45 రోజుల్లోగా కుమార్‌కు చెల్లించాల్సిందిగా ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని