Cloud gaming: ఎయిర్‌టెల్‌ 5జీ క్లౌడ్‌ గేమింగ్‌ సెషన్‌ విజయవంతం

భారత్‌లో మొదటిసారిగా 5జీ నెట్‌వర్క్‌ ఆధారిత క్లౌడ్‌ గేమింగ్‌ సెషన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ గురువారం ప్రకటించింది. 5జీ ట్రయల్స్‌లో భాగంగా ప్రభుత్వ టెలికాం విభాగం కేటాయించిన స్పెక్ట్రంలో...

Published : 03 Sep 2021 01:51 IST

దిల్లీ: భారత్‌లో మొదటిసారిగా 5జీ నెట్‌వర్క్‌ ఆధారిత క్లౌడ్‌ గేమింగ్‌ సెషన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ గురువారం ప్రకటించింది. 5జీ ట్రయల్స్‌లో భాగంగా ప్రభుత్వ టెలికాం విభాగం కేటాయించిన స్పెక్ట్రంలో ఈ ప్రక్రియను నిర్వహించినట్లు పేర్కొంది. గురుగ్రాంలోని మానెసర్‌లో ఈ సెషన్‌ చేపట్టినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా భారతీ ఎయిర్‌టెల్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ రణ్‌దీప్‌ సెఖాన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మొబైల్‌ గేమింగ్‌కు ఆదరణ పెరుగుతోందని, అద్భుతమైన డిజిటల్ భవిష్యత్తుకు ఇది నాంది అని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్థ ప్రస్తుతం దేశంలోని ఆయా నగరాల్లో 5జీ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఎరిక్సన్, నోకియాతో జట్టుకట్టింది.

ఏమిటీ క్లౌడ్‌ గేమింగ్‌?

డౌన్‌లోడ్‌ చేసుకునే అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లోనే రియల్‌ టైమ్‌లో గేమ్స్‌ ఆడుకునేందుకు వీలు కల్పించే సాంకేతికతే క్లౌడ్‌ గేమింగ్‌. భారత్‌లో యువజనాభా, పెరుగుతున్న స్మార్ట్‌ ఫోన్లు, 5జీ సాంకేతికత ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో మొబైల్‌ గేమింగ్‌ రంగం 2.4 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల మార్కెట్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం 436 మిలియన్లుగా ఉన్న ఆన్‌లైన్‌ గేమర్స్‌ సంఖ్య.. 2022 నాటికి 510 మిలియన్లకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిత్తల్‌ ఇటీవల తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని