NV Ramana: ‘అక్కినేని’ జీవిత సాఫల్య పురస్కారం తీసుకోవడం నా అదృష్టం: జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కార గ్రహీత, పద్మవిభూణ్‌ అక్కినేని నాగేశ్వరరావు 99వ జయంతి

Updated : 23 Sep 2022 21:44 IST

హైదరాబాద్‌: దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్‌ అక్కినేని నాగేశ్వరరావు 99వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. రసమయి సాహిత్య, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నిర్వహించిన ఈ వేడుకల్లో సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు రసమయి-డా.అక్కినేని లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తమిళనాడు మాజీ గవర్నర్‌ రామ్మోహన్‌రావు జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చేసిన సేవలను కొనియాడారు.

నేను సినిమాలు చూడటం తక్కువ..

అనంతరం ఎన్‌.వి.రమణ మాట్లాడుతూ అక్కినేనితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘నేను జడ్జి కాకముందే అక్కినేని బాగా తెలుసు. ఎన్నో వేదికలు పంచుకొని మాట్లాడుకొనేవాళ్లం. నేను సినిమాలు చూడటం చాలా తక్కువ. ఎన్టీఆర్‌తో ఉన్న పరిచయం వల్ల సినీ రంగంపై అవగాహన ఉండేది. అక్కినేని తన అనుభవాలను చెబుతుంటే ఆనందంగా ఉండేది. సీజేఐగా పదవి విరమణ తర్వాత అక్కినేని పురస్కారం తీసుకోవడానికి హైదరాబాద్ వచ్చా. ఈ పురస్కారానికి నేను అర్హుడినో అనర్హుడినో గానీ ఈ అవార్డు తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు.

ఎన్టీఆర్‌, అక్కినేని తెలుగువారైనందుకు గర్వంగా ఉంది

‘‘అక్కినేని తన స్వయం కృషితో ఎదిగారు. పెద్ద పెద్ద డిగ్రీలు, సంపదలు లేకున్నా మానవత్వంతో ఎదిగిన మనిషి అక్కినేని. ఆయన హాస్యం ఎంతో సున్నితంగా ఉండేది. తెలుగు సినీ రంగానికి అక్కినేని చేసిన సేవలను నేటికి గుర్తు పెట్టుకుంటున్నాం. ఎన్టీఆర్, అక్కినేని తెలుగు వారైనందుకు గర్వంగా ఉంది. నేను సినిమాలు చూడటం తక్కువే గానీ.. పాత సినిమాలు చూసి ఎంతో సంతోషిస్తాం. తెలుగు భాషలో పుట్టిన నటీనటులు, కవులకు అంత ఆదరణ లభించడం లేదు. సాటి తెలుగు వారిగా తెలుగు నటీనటులందరినీ ఆదరించాలి. న్యాయవ్యవస్థ పునర్నిర్మాణం కోసం నా వంతు కృషి చేశాను. 16 నెలల్లో నేను చేయాల్సింది చేశాను’’ అన్నారు. 

విమర్శ కాదు గానీ..  కొత్త సినిమాలు నిలబడటం లేదు!

‘‘నాగేశ్వరరావు విభిన్న పాత్రల్లో నటించారు. పౌరాణికంగా ఆయన గొప్ప పేరు తెచ్చుకోలేకపోయినప్పటికీ విభిన్న భాషా చిత్రాల్లో నటించి భారతదేశ సమైక్యతను చాటిచెప్పిన గొప్ప జాతీయవాది. సాహిత్యం, భాష, దేశభక్తి, సమాజసేవ విషయాల్లో ఆయన తిరుగులేని విధంగా నిబద్ధతతో సినీ రంగంలో జీవించారు. అలాంటి నాగేశ్వరరావు, రామారావు, ఎస్వీ రంగారావు, నాగభూషణ్‌లాంటి మహానటులు కలిసిన సినీ రంగం మనది. నేను ఎక్కువ సినిమాలు చూడలేకపోయినప్పటికీ ఇప్పటికీ పాత సినిమా క్యాసెట్లు, వీడియోలు చూసి చాలా ఆనందిస్తాం.  సినిమా రంగం గురించి ఎక్కువ విమర్శ చేయడం కాదు గానీ.. నాటి పాత సినిమాలు నిలబడినట్టుగా కొత్త సినిమాలు నిలబడటంలేదు. దానికి కారణమేంటో సినీ రంగంలో ప్రముఖులే ఆలోచించాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ పెరిగింది. రెమ్యునరేషన్‌ పెరిగింది.. సదుపాయాలు పెరిగాయి. సాహిత్యంలో గానీ, నటనలో గానీ విలువ, నాణ్యత లేదని అనిపిస్తోంది. దాన్ని మెరుగుపరుచుకోవాల్సిన బాధ్యత మన సినీరంగంపై ఉందనే విషయాన్ని సినీ పెద్దలు గ్రహించాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి.సుబ్బరామిరెడ్డి, ఆచార్య కొలకలూరి ఇనాక్‌, కేఐ వరప్రసాద రెడ్డి,  మురళీమోహన్‌, నాగసుశీల, సుప్రియ, తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని