Vande Bharat Express: సికింద్రాబాద్‌- విశాఖ వందే భారత్‌ రైలు.. టికెట్‌ ధరలో వ్యత్యాసం అందుకే!

Vande Bharat Express Fare Details: ఈ నెల 16 నుంచి వందే భారత్‌ రైలు రెగ్యులర్‌ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. టికెట్‌ ధరలు సైతం వెల్లడయ్యాయి. అయితే, వచ్చీపోయే రైలు టికెట్‌ ధరలో వ్యత్యాసం కనిపిస్తోంది.

Updated : 14 Jan 2023 16:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల మధ్య అందుబాటులోకి రాబోయే వందే భారత్‌ రైలుకు (Vande Bharat Express) సంబంధించి ఛార్జీల వివరాలు బయటకొచ్చాయి. ఇప్పటికే రైల్వే శాఖ ఈ రైలు బుకింగ్స్‌ను ప్రారంభించింది. సోమవారం (జనవరి 16) నుంచి ప్రయాణానికి గానూ ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ఛైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌ పేరిట రెండు తరగతులు ఈ రైల్లో అందుబాటులో ఉన్నాయి. విశాఖ నుంచి సికింద్రాబాద్‌ (VSKP- SC) వచ్చే రైలుకు 20833, సికింద్రాబాద్‌- విశాఖ (SC- VSKP) రైలుకు 20834 నంబర్‌ను కేటాయించారు. విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1,720, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌ టికెట్‌ ధరను రూ.3,170గా పేర్కొన్నారు. అదే సికింద్రాబాద్ నుంచి బయల్దేరి వెళ్లే రైల్లో ఛైర్‌ కార్‌ టికెట్‌ ధర రూ.1665, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ రూ.3,120గా పేర్కొన్నారు. ఈ టికెట్‌ ధరలను గమనిస్తే స్వల్ప వ్యత్యాసం కనిపిస్తోంది. సాధారణంగా అప్ అండ్‌ డౌన్‌ ట్రైన్‌ టికెట్‌ ధరలు ఒకేలా ఉండాల్సిన చోట ఇలా వేర్వేరుగా ఉండడంతో కొందరు గందరగోళానికి గురవుతున్నారు. అయితే, కేటరింగ్‌కు సంబంధించిన ఛార్జీలు వేర్వేరుగా ఉండడంతో ఈ వ్యత్యాసం కనిపిస్తోంది.

Also Read: స్లైడింగ్‌ డోర్లు, రీడింగ్‌ లైట్స్‌.. 16 కోచ్‌లు.. 1,128 సీట్లు

సికింద్రాబాద్‌- విశాఖ వందే భారత్‌ రైలు ఛైర్‌కారును టికెట్‌ ధరలను పరిశీలిస్తే.. బేస్‌ ఫేర్‌ రూ.1207గా నిర్ణయించారు. రిజర్వేషన్‌ ఛార్జీ రూ.40, సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జీ రూ.45,  మొత్తం జీఎస్టీ రూ.65గా పేర్కొన్నారు. రైల్లో సరఫరా చేసే ఆహార పదార్థాలకు గానూ రూ.308 చొప్పున ఒక్కో ప్రయాణికుడి నుంచి ఛార్జీ చేయనున్నారు. అదే విశాఖ- సికింద్రాబాద్ రైల్లో బేస్‌ ఛార్జీని రూ.1206గా పేర్కొన్నారు. కేటరింగ్‌ ఛార్జీని మాత్రం .364గా పేర్కొన్నారు. ఇక్కడే టికెట్‌ ధరలో 60 రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది.

సికింద్రాబాద్‌- విశాఖ వెళ్లే రైల్లో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌ ధరను పరిశీలిస్తే.. బేస్‌ ఫేర్‌ రూ.2,485గా పేర్కొన్నారు. రిజర్వేషన్‌ ఛార్జీ రూ.60, సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జీ రూ.75, జీఎస్టీ రూ.131గా పేర్కొన్నారు. కేటరింగ్‌కు గానూ రూ.369 వసూలు చేస్తున్నారు. అదే విశాఖ నుంచి బయల్దేరే రైల్లో కేటరింగ్‌ ఛార్జీని రూ.419గా పేర్కొన్నారు. ఇక్కడ కూడా కేటరింగ్‌ ఛార్జీల్లో కొంత వ్యత్యాసం కనిపిస్తోంది.

Also Read: Vande Bharat Express: వందే భారత్‌.. అలా మొదలైంది!

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్‌ షెడ్యూల్‌ను బట్టి అందించే ఆహార పదార్థాల్లో మార్పులు ఉంటాయి. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి పూట భోజనం అందిస్తారు. ఈ కారణంగానే సికింద్రాబాద్‌- విశాఖ వందే భారత్‌ రైల్లో ఆహార పదార్థాల వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక వందేభారత్‌ రైల్లో ఎలాంటి ఆహారపదార్థాలు అందిస్తారనేది తెలియాల్సి ఉంది. సాధారణంగా ఒక్కో రైల్వే జోన్‌లో స్థానిక ఆహారపు అలవాట్లను బట్టి ఒక్కో తరహా ఆహారాన్ని అందిస్తారు. ఒకవేళ టికెట్‌ బుకింగ్‌ సమయంలో ఆహారం వద్దనుకుంటే ఆ మొత్తాన్ని టికెట్‌ ధరలోంచి మినహాయిస్తారు.

సికింద్రాబాద్‌ నుంచి ఒక్కో స్టేషన్‌కు ఛార్జీలు ఇలా..(ఛైర్‌కార్‌)

  • సికింద్రాబాద్ నుంచి వరంగల్ - రూ.520
  • సికింద్రాబాద్ నుంచి ఖమ్మం - రూ.750
  • సికింద్రాబాద్ నుంచి విజయవాడ - రూ.905
  • సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి - రూ.1365
  • సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం - రూ.1665

ఎగ్జిక్యూటివ్‌ ఛార్జీలు

  • సికింద్రాబాద్ నుంచి వరంగల్ - రూ.1005
  • సికింద్రాబాద్ నుంచి ఖమ్మం - రూ.1460
  • సికింద్రాబాద్ నుంచి వియవాడ - రూ.1775
  • సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి - రూ.2485
  • సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం - రూ.3120

విశాఖ నుంచి ఛార్జీలు (ఛైర్‌కార్‌‌)

  • విశాఖ నుంచి రాజమండ్రి - రూ.625
  • విశాఖ నుంచి విజయవాడ రూ.960
  • విశాఖ నుంచి ఖమ్మం - రూ. 1,115
  • విశాఖ నుంచి వరంగల్‌ రూ.1,310
  • విశాఖ నుంచి సికింద్రాబాద్- రూ.1720

ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధరలు

  • విశాఖ నుంచి రాజమండ్రి రూ.1215
  • విశాఖ నుంచి విజయవాడ రూ.1825
  • విశాఖ నుంచి ఖమ్మం రూ.2130
  • విశాఖ నుంచి వరంగల్‌ రూ.2,540
  • విశాఖ నుంచి సికింద్రాబాద్ రూ.3170

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని