Telangana News: మిరపకాయలతో హోమం.. క్షుద్రపూజలంటూ డీహెచ్‌ శ్రీనివాసరావుపై విమర్శలు

ఖమ్మంలో రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌  శ్రీనివాసరావు పాల్గొన్న పూజలు వివాదాస్పదమయ్యాయి. గిరిజన ప్రాంతంలో అక్కడి స్థానికుల ఆహ్వానం మేరకు ప్రత్యంగిరాదేవి

Published : 07 Apr 2022 01:52 IST

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు పాల్గొన్న పూజలు వివాదాస్పదమయ్యాయి. గిరిజన ప్రాంతంలో అక్కడి స్థానికుల ఆహ్వానం మేరకు ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొన్న ఆయన స్వయం ప్రకటిత దేవతతో కలిసి హోమం నిర్వహించారు. అక్కడ హోమ గుండంలో మిరపకాయలు వేసి పూజలు చేయడంపై విమర్శలు వచ్చాయి. క్షుద్ర పూజల్లో పాల్గొన్నారని ఆరోపణలు వినిపించాయి. చిత్రమైన హోమంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం పాత అంజనాపురం పంచాయతీ జిమ్నా తండాలో మంగళవారం రాత్రి సుజాతనగర్‌ తెరాస ఎంపీపీ విజయలక్ష్మి నిర్వహించిన హోమంలో డీహెచ్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాత్రి సమయంలో నిర్వహించిన ప్రత్యేక హోమ పూజల కార్యక్రమంలో డీహెచ్‌ శ్రీనివాసరావు తలపాగా ధరించి హోమం చుట్టూ తిరుగుతూ పూజలు నిర్వహించారు. తెరాస ఎంపీపీగా ఉన్న విజయలక్ష్మి ప్రతి మంగళవారం తన ఇంటి ఆవరణలోనే గిరిజన సంప్రదాయానికి చెందిన వివిధ రకాల పూజలు నిర్వహిస్తుండటం ఆనవాయితి. ఈనెల 24న పాల్వంచలో తన ట్రస్టు పేరిట మెగా వైద్య శిబిరం నిర్వహించాలని నిర్ణయించిన డీహెచ్‌ శ్రీనివాసరావు.. మంగళవారం సన్నాహక ఏర్పాట్ల కోసం కొత్తగూడెం వచ్చారు. ఇందులో భాగంగా ఎంపీపీ విజయలక్ష్మి ఆహ్వానం మేరకు అదే రోజు రాత్రి హోమంలో పాల్గొన్నారు. అయితే, ఈ హోమ కార్యక్రమం మిరపకాయలతో నిర్వహించటం, ఆ వీడియోలు వైరల్‌గా మారడం చర్చనీయాంశంగా మారింది. దీంతో నిర్వాహకులు ఈ హోమ పూజలపై వివరణ ఇచ్చారు. కుల దేవతను పూజిస్తూ గిరిజన సంప్రదాయంలో సాగే  ప్రత్యంగిరాదేవి హోమంగా పేర్కొన్నారు. ప్రతి వారం గ్రామంలో ఇలాంటి హోమం నిర్వహిస్తుంటామని నిర్వాహకులు చెబుతున్నారు.

మూఢనమ్మకాలను విశ్వసించను: డీహెచ్‌ శ్రీనివాసరావు

క్షుద్రపూజల్లో పాల్గొన్నారన్న ఆరోపణలపై డీహెచ్‌ శ్రీనివాసరావు స్పందించారు. స్థానిక  గిరిజన ఆచారాలను గౌరవించి ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజలో పాల్గొన్నట్టు చెప్పారు. ‘‘ స్వయం ప్రకటిత దేవతతో నాకు సంబంధం లేదు. అమ్మవారి హోమ పూజల్లో స్థానికులతో కలిసి పాల్గొన్నా. మూఢనమ్మకాలను విశ్వసించను. తప్పుడు అర్థాలు తీసి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. జరిగినవి క్షుద్రపూజలు కాదు.. వ్యక్తిగత పూజలు కాదు. శాస్త్రాన్ని నమ్మే వ్యక్తిని.. ఆచరించే వ్యక్తిని’’ అని డీహెచ్‌ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని