Amara Raja Batteries: అమరరాజా బ్యాటరీస్‌పై ప్రజాభిప్రాయసేకరణ జరపండి: సుప్రీం కోర్టు

అమరరాజా బ్యాటరీస్‌ వ్యవహారంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని ఏపీ పీసీబీకి సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే, సంస్థ మూసివేతపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Updated : 20 Feb 2023 17:41 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా పని చేస్తున్న అమరరాజా బ్యాటరీస్‌ (Amara Raja Batteries) కాలుష్య వ్యవహారంపై సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (AP PCB) షోకాజ్‌ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టేను అత్యున్నత న్యాయస్థానం ఎత్తివేసింది. అయితే, సంస్థ మూసివేతపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ కొనసాగుతుందని జస్టిస్‌ అజయ్‌ రాస్తోగి, జస్టిస్‌ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

అమర రాజా బ్యాటరీస్‌ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని, దీనివల్ల పరిసర ప్రాంతాల జలాల్లో సీసం ధాతువులు పెరుగుతున్నందున సంస్థను మూసివేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) గతంలో షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. సదరు నోటీసులపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిని సవాల్‌ చేస్తూ బ్యాటరీస్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజకీయ కారణాలతో ఇప్పటి వరకు 34సార్లు నోటీసులు ఇచ్చి తమను వేధిస్తున్నారని అమర రాజా తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, ఆదినారాయణరావు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. షోకాజ్‌ నోటీసులపై చట్టప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ జరిపి నిర్ణయం తీసుకోవాలని పీసీబీకి సుప్రీం కోర్టు ఆదేశించింది. నోటీసులపై న్యాయ పరిష్కారాల కోసం ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత జారీ చేసే ఉత్తర్వులను నాలుగు వారాల పాటు నిలుపుదల చేయాలని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని