Andhra News: ‘భూములిచ్చింది అమరావతి అభివృద్ధికి.. అమ్ముకోవడానికి కాదు’

రాజధాని భూములను ప్రభుత్వం తాకట్టు పెట్టడంపై అమరావతి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మందడంలోని

Updated : 08 Feb 2022 13:15 IST

అమరావతి దళిత ఐకాస ధ్వజం

అమరావతి: రాజధాని భూములను ప్రభుత్వం తాకట్టు పెట్టడంపై అమరావతి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మందడంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద అమరావతి దళిత ఐకాస ఆందోళన చేపట్టింది. రాజధానిలోని 407 ఎకరాలను హడ్కోకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) శనివారం తనఖా పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

‘‘రాజధాని కోసం మా పూర్వీకుల నుంచి వచ్చిన భూములను ప్రభుత్వానికి ఇచ్చాం. వైకాపా ప్రభుత్వం భూములను తనఖా పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము భూములిచ్చింది ప్రాంతం అభివృద్ధి చేయడానికి కానీ అమ్ముకొని పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి కాదు. తాకట్టుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ చేసిన వారిపై కేసు పెడుతున్నాం.
మందడంలోని 196ఎకరాల భూమిని తాకట్టు కోసం రిజిస్ట్రేషన్‌ చేశారు. దీన్ని రద్దు చేయాలని రిజిస్ట్రార్‌ను, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అమరావతి ప్రాంతం అభివృద్ధి కోసమే భూములను తాకట్టు పెడుతున్నట్లు ప్రమాణపత్రం ఇస్తే మేము సహకరిస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం. రాజధాని ప్రాంతం అడవిలా, ఎడారిలా ఉందన్న మంత్రులు.. ఇప్పుడు ఏ విధంగా తనఖా పెడుతున్నారు’’ అని అమరావతి దళిత ఐకాస నాయకులు, రైతులు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని