అమరావతి అనుకూల, వ్యతిరేక నినాదాలతో హోరెత్తిన తణుకు.. పాదయాత్రలో ఉద్రిక్తత

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర  31వ రోజు తణుకు మండలం వేల్పూరు నుంచి ప్రారంభమైంది. తణుకు నరేంద్ర కూడలికి చేరుకున్న పాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా శ్రేణులు విఫలయత్నం చేశారు.

Updated : 12 Oct 2022 16:46 IST

తణుకు: నల్ల బెలూన్లతో వైకాపా నిరసనలతో పాటు నినాదాలు, అమరావతికి వ్యతిరేకంగా అడుగడుగునా ఫ్లెక్సీలు ఉన్నప్పటికీ రాజధాని రైతుల మహాపాదయాత్ర మొక్కవోని దీక్షతో సాగుతోంది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర బుధవారం 31వ రోజు తణుకు మండలం వేల్పూరు నుంచి ప్రారంభమైంది. తణుకు నరేంద్ర కూడలికి చేరుకున్న పాదయాత్రకు స్థానికులు అపూర్వ సాగతం పలికారు. మరోవైపు వైకాపా నేతలు పాదయాత్రను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. నరేంద్ర కూడలిలో రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా 3 రాజధానుల పేరుతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా సభ ఏర్పాటు చేసి, నిరసన తెలుపుతూ గాల్లోకి బెలూన్లు ఎగురవేశారు.

జై జగన్‌.. అమరావతి వద్దు 3 రాజధానులు ముద్దు అంటూ వైకాపా శ్రేణులు రోడ్డుకు ఒకవైపు నిల్చుని నినాదాలు చేశారు. అమరావతి రైతులను రెచ్చగొట్టేలా మహిళలు నినాదాలు చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రక్షణ వలయంగా ఏర్పడి రోప్‌ సాయంతో వైకాపా శ్రేణులను నిలువరించారు. నిరసనల మధ్యే రైతుల పాదయాత్ర ఉండ్రాజవరం వైపు సాగింది. పాదయాత్రకు సంఘీభావంగా వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు తరలిరావడంతో తణుకు పట్టణం జనసంద్రంగా మారింది. భారీగా ట్రాఫిక్‌ స్తంభించడంతో ఒక దశలో అమరావతి మద్దతుదారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మద్దతుదారులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని