Amaravati: ఆర్‌-5 జోన్‌లో పట్టాల పంపిణీ.. నల్లబెలూన్లతో రాజధాని రైతుల నిరసన

ఆర్‌-5 జోన్‌ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా రాజధాని రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

Updated : 26 May 2023 11:15 IST

తుళ్లూరు గ్రామీణం: ఆర్‌-5 జోన్‌ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా రాజధాని రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో పట్టాల పంపిణీకి నేడు సీఎం జగన్‌ రానున్న నేపథ్యంలో రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు ఆందోళన చేపట్టారు. పేదలకు పట్టాల పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. 

వెలగపూడిలోని దీక్షా శిబిరం వద్ద రైతులు నల్లబెలూన్లు, నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. తుళ్లూరులో ఇళ్లు, దుకాణాలపై నల్ల జెండాలు ఎగురవేశారు. దీక్షా శిబిరం వద్ద ఉరితాళ్లతో నిరసన తెలిపారు. తమను మోసం చేయొద్దని.. సీఎం జగన్‌ మొండి వైఖరిని నశించాలన్నారు. పేదలారా.. మరోసారి మోసపోవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అమరావతిని విచ్ఛిన్నం చేసే సీఎం గో బ్యాక్‌, రాజధాని ద్రోహులు గో బ్యాక్‌, అమరావతిని నిర్మించండి.. ఆంధ్రప్రదేశ్‌ కాపాడండి అంటూ నినాదాలు చేశారు. మరోవైపు మందడంలోని దీక్షా శిబిరం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులు బయటకు రాకుండా భారీగా పోలీసులను మోహరించారు. సీఎం పర్యటన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో సుమారు 3వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరావతి రైతుల ఆందోళనపై పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. అమరావతి జేఏసీ నేతలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనకుండా ముందుగానే వారిని గృహ నిర్బంధం చేశారు. అమరావతి బహుజన ఐకాస నేత పోతుల బాలకోటయ్యను స్వస్థలమైన కంచికచర్లలో హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌  నేడు ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా వెంకటపాలెంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మందికి, ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన 27,031 మందికి పట్టాలు పంపిణీ చేస్తారు. వీరికి ఇళ్ల నిర్మాణానికి సీఆర్డీఏ పరిధిలోని 1,402 ఎకరాల్లో 25 లేఔట్లు ఏర్పాటుచేశారు. ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు, సీఆర్డీఏ ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో గృహాలనూ లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని