Polavaram: క్లారిటీ వచ్చే వరకు ఆ పనులు జరగవు: మంత్రి అంబటి

పోలవరంలో డయాఫ్రం వాల్‌ ఎంత దెబ్బతిన్నదనే విషయంపై అధ్యయనం ఎప్పటికి పూర్తవుతుందో..

Updated : 10 Sep 2022 16:01 IST

విజయవాడ: పోలవరంలో డయాఫ్రం వాల్‌ ఎంత దెబ్బతిన్నదనే విషయంపై అధ్యయనం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నివేదిక వచ్చే వరకు ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు జరగడానికి అవకాశం లేదని చెప్పారు. అందుకే పనులు కుంటుపడ్డాయన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘డయాఫ్రం వాల్‌ దెబ్బతిందనేది మా అభిప్రాయం. దీన్ని ఏ సంస్థా ధ్రువీకరించలేదు. ఈ విషయాన్ని చెప్పే సంస్థలు ప్రపంచంలో ఎక్కడా లేవు. డయాఫ్రం వాల్‌ ఎంత మేర దెబ్బతిందనే అంశంపై నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ ద్వారా అధ్యయనం జరుగుతోంది. అధ్యయనం తర్వాతే డయాఫ్రం వాల్‌ దెబ్బతిందా? లేదా? అనేది తేలుతుంది. ఆ నివేదిక వచ్చే వరకు రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు జరగవు. దెబ్బతిందని నిర్ధారణకు వచ్చిన తర్వాతే దాన్ని రిపేర్‌ చేయాలా?కొత్త డయాఫ్రం వాల్‌ కట్టాలా?అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ క్లారిటీ వచ్చే వరకు పోలవరంలో ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు జరిగేందుకు అవకాశం లేదు.

కాఫర్‌ డ్యాం కంటే డయాఫ్రం వాల్‌ కట్టడం ముమ్మాటికీ తప్పే. ఈ విషయంపై అవసరమైతే పీపీఏ, సీడబ్ల్యూసీ, కేంద్రాన్ని అడుగుతాం. పోలవరంపై ఇతర రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఏదో జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తు్న్నారు’’ అని అంబటి రాంబాబు అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న ప్రాజెక్టు గేట్లపై అధ్యయనం చేస్తున్నామని మంత్రి తెలిపారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు ఏర్పాటుకు టెండర్లు పిలిచామని.. ఈలోపే గేటు కొట్టుకుపోయిందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని