Anti-Pornography Acts: భారతదేశంలో పోర్నోగ్రఫీ కట్టడికి చేసిన చట్టాలు - వాటికి విధించే శిక్షలు!

ఇంతకీ మన దేశంలో పోర్నోగ్రఫీ కట్టడికి సంబంధించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి. వాటికి ఎలాంటి శిక్షలు ఉన్నాయో చూద్దాం..

Updated : 23 Jul 2021 15:54 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పోర్న్‌ రాకెట్‌లో కీలక సూత్రధారిగా పేర్కొంటూ ఇటీవల ముంబయి క్రైం బ్రాంచి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ‘హాట్‌షాట్స్‌’ అనే పోర్న్‌ యాప్‌ను ఆయన నడుపుతున్నారనేది అభియోగం. ఇంతకీ మన దేశంలో పోర్నోగ్రఫీ కట్టడికి సంబంధించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి. వాటికి ఎలాంటి శిక్షలు ఉన్నాయో చూద్దాం..

చూడటం నేరంకాదు..కానీ..

ఐపీసీ ప్రకారం పర్సనల్‌ డివైజెస్‌లో పోర్నోగ్రఫీని వ్యక్తిగతంగా చూడటం నేరం కాదు. అయితే వాటి తయారీ, వ్యాప్తి, పంపిణీలను నేరంగా చట్టాలు చెబుతున్నాయి. అడ్వొకేట్‌  కమలేష్‌ వశ్వాణి వేసిన ఓ పిల్‌కు సంబంధించి 2015 జులైలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్‌.ఎల్‌.దత్తు..  పోర్నోగ్రఫీని చూడకుండా నిషేధించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని అన్నారు. ఎందుకంటే అది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రసాదించిన వ్యక్తుల జీవించే హక్కు, స్వేచ్ఛకు భంగం కలుగుతుందని  ఇతరులు అడగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.  అయితే అప్పట్లో కమలేశ్‌ వశ్వాణీ దేశంలో కొన్ని వేలల్లో పోర్న్‌ వెబ్‌సైట్స్‌ నడుస్తున్నాయని చెప్పారు. ఇదిలా ఉంటే ఆగస్టు 2015లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు 857 పోర్న్‌ వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసేలా ఆదేశించమని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌(డాట్‌)ను కోరింది.

భారత శిక్షా స్మృతిలో ఏముంది?

భారత శిక్షాస్మృతిలోని 292 సెక్షన్‌ ప్రకారం.. ఓ కరపత్రం, పేజీ, సాహిత్యం, బొమ్మ, చిత్రం, ప్రతిమ.. మరేదైనా వస్తువు అశ్లీలంగా కనిపించి,  కామవాంఛను రగిలించేలా, రెచ్చగొట్టేలా ఉంటే వాటిని అశ్లీలంగా భావిస్తారు. అలాంటి అశ్లీల వస్తువుల తయారీ, అమ్మకం, దిగుమతి, ఎగుమతి, ప్రకటనలతోపాటు, దాని నుంచి లాభం పొందడం కూడా నేరమని చట్టం చెబుతోంది.  దీని ప్రకారం మొదటిసారి ఇలాంటి నేరాలకు పాల్పడితే రెండేళ్లపాటు జైలు శిక్ష, రూ.రెండువేల జరిమానా విధించవచ్చు. రెండోసారి చేస్తే ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5000 ఫైన్‌ విధించవచ్చు. అలాగే ఐపీసీలోని 293 ప్రకారం 20 ఏళ్ల లోపువారికి అలాంటివాటిని అమ్మడం లేదా
షేర్‌ చేయడం నేరమే. మొదటిసారి ఇలాంటి నేరానికి పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష, రూ.రెండువేల జరిమానా ఉంటుంది. రెండోసారి చేస్తే ఏడేళ్ల జైలుశిక్ష, రూ. ఐదువేల జరిమానా విధించవచ్చు. అలాగే ఐపీసీ 294 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల కార్యక్రమాల్లో పాల్గొనడం, పాటలు పాడటం, నృత్యాలు చేయడం కూడా శిక్షార్హమే. దీనికి మూడునెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు. సినిమాలు, ఇంటర్నెట్‌లాంటివి లేని కాలంలో తీసుకొచ్చిన చట్టాలివి. కాబట్టి నేడు స్త్రీలను అశ్లీల కార్యక్రమాల్లో పాల్లొనేలా చేసి, దాన్ని చిత్రీకరించి, వ్యాపారం చేసుకోవడం తప్పు కాకుండా ఎలా ఉంటుందని విజ్ఞులు అంటున్నారు.

మహిళలను అసభ్యంగా చూపించడాన్ని నిషేధించే చట్టం -1986
మహిళలను ప్రకటనలు, ప్రచురణలు, రచనలు, చిత్రాలు, బొమ్మలు లేదా మరే ఇతర మార్గాల్లోనైనా అసభ్యంగా చూపించడాన్ని నిషేధించే చట్టం ఇది. ఇలాంటి వాటిని ప్రచురించినా, పంపిణీ చేసినా మొదటిసారి నేరానికి రెండేళ్ల జైలుశిక్ష, రెండోసారి నేరానికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం- 2000లో ఏముంది?
ప్రస్తుతం రాజ్‌కుంద్రాపై ఐటీ చట్టంలోని పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. సెక్షన్‌ 67 ప్రకారం ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల ద్వారా అశ్లీలమైనదాన్ని ప్రచురించడం, ప్రసారం చేయడం నేరం. దీనికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తారు.  అలాగే  సెక్షన్‌ 67 ఎ ప్రకారం ఎవరైనా లైంగిక కార్యకలాపాల్లాంటి పోర్నోగ్రఫీని చిత్రీకరించినా.. ప్రసారం చేయించినా, వేరొకరి చేత అలాంటి పనులు చేయించినా దానికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల ఫైన్‌ విధిస్తారు. 67బి ప్రకారం చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించిన పనులు చేసినా, ఇంటర్నెట్‌లో వాటి గురించి బ్రౌజ్‌ చేసినా, డౌన్లోడ్‌ చేసినా లేదా పిల్లల పోర్నోగ్రఫీకి సంబంధించి డిజిటల్‌ బొమ్మలు తయారు చేసినా శిక్షార్హులవుతారు. మొదటిసారి తప్పుకు ఐదేళ్ల జైలు శిక్ష, రెండోసారి చేస్తే ఏడేళ్ల జైలుశిక్ష, పదిలక్షల రూపాయల ఫైన్‌ వేస్తారు.

పిల్లలను లైంగిక నేరాలనుంచి రక్షించే చట్టం-2012

ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రం సెక్సువల్‌ అఫెన్సెస్‌ యాక్ట్‌(పోక్సో) ప్రకారం పిల్లలకు సంబంధించిన పోర్నోగ్రఫీని తమవద్ద కలిగి ఉన్నా, సెక్షన్‌15 అనుగుణంగా చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. దీనికి మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. సెక్షన్‌14 ప్రకారం పిల్లల్ని పోర్నోగ్రఫీ కోసం వాడుకుంటే ఐదేళ్ల జైలుశిక్ష ఉంటుంది. రెండోసారి తప్పు చేస్తే ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడుతుంది.

ఉన్న చట్టాలే సరిపోతాయా?

ప్రస్తుతం ఉన్నఐపీసీ, మరికొన్ని చట్టాల్లో యాప్‌లు, ఇంటర్నెట్‌ల ప్రస్తావన లేదు. దాంతో ఐపీసీ, మరికొన్ని చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకుని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌లు అశ్లీలతను ప్రసారం చేస్తున్నాయని కొందరు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పటికే ఉనికిలో ఉన్న చట్టాలన్నింటినీ సరిగ్గా అన్వయిస్తే, నిందితులు తప్పించుకోలేరని మరికొంతమంది  ఉద్దేశం. ఏదేమైనా నేటి అవసరాలకు అనుగుణంగా చట్టాల్లో మరింత స్పష్టంగా నేరాలను నిర్వచించాల్సిన అవసరముందని, నిందితుల నేరం, శిక్ష, పాత్ర, అధికార పరిధిని స్పష్టంగా వివరించాల్సి ఉందని కొందరు న్యాయ నిపుణులు అంటున్నారు. చాలా వరకు అశ్లీల వెబ్‌సైట్లలోకి, యాప్స్‌లోకి కంటెంట్‌ను విదేశాల్లోంచి అప్‌లోడ్‌ చేయిస్తుండటం వల్ల, ఇక్కడున్న నిందితులు ఎట్టి పరిస్థితుల్లోను తప్పించుకోకుండా పకడ్బందీగా చట్టాలు చేయాలని అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని