పని పట్ల అంకితభావం అంటే అదే మరి..!

ఉద్యోగాలు చేసే స్త్రీలకు విధులతో పాటు కుటుంబ వ్యవహారాలూ సక్రమంగా చూసుకోవడం అంటే సాధారణ విషయమేం కాదు. నిత్యం ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. అందులోనూ ఓ బిడ్డకు జన్మనిచ్చాక బాధ్యతలు మరింత పెరుగుతాయి.

Published : 14 Oct 2020 01:03 IST

లఖ్‌నవూ: ఉద్యోగాలు చేసే స్త్రీలకు విధులతో పాటు కుటుంబ వ్యవహారాలూ సక్రమంగా చూసుకోవడం అంటే సాధారణ విషయమేం కాదు. నిత్యం ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. అందులోనూ ఓ బిడ్డకు జన్మనిచ్చాక బాధ్యతలు మరింత పెరుగుతాయి. కానీ యూపీకి చెందిన ఓ ఐఏఎస్‌ అధికారిణి సౌమ్య పాండే బిడ్డకు జన్మనిచ్చిన 14 రోజుల్లోనే విధులకు హాజరై తన అంకిత భావాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా ఆమె నేటి తరం స్త్రీలకు ఆదర్శంగా నిలిచారు. ఆమె ప్రస్తుతం గజియాబాద్‌ జిల్లా కొవిడ్‌ నోడల్‌ అధికారిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ.. ‘నేను ఓ ఐఏఎస్‌ అధికారిణిని కాబట్టి నేను కుటుంబ బాధ్యతలతో పాటు నా విధులపైనా దృష్టి సారించాలి. దేవుడి దయ వల్ల నేను ఈ రోజు నా బిడ్డను చూసుకుంటూనే విధులకు సైతం హాజరు కాగలుగుతున్నాను. ఈ విషయంలో నా కుటుంబసభ్యులు ఎంతో అండగా నిలుస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ఇప్పటివరకు విధుల పట్ల నాకు సహకారం అందించిన జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు. కొవిడ్‌ సమయంలో పనిచేసే ప్రతి గర్భిణీ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి’ అని ఆమె జాగ్రత్తలు తెలిపారు. కాగా ఆమె బిడ్డకు జన్మనిచ్చిన 14 రోజులకే విధులకు హాజరయ్యారని, ఆ అధికారిణి ఎంతో మందికి ఆదర్శం అని పేర్కొంటూ ఓ వైద్యుడు ట్విటర్‌లో వీడియో పోస్ట్‌ చేశారు. కాగా విధుల పట్ల ఆమెకు ఉన్న అంకిత భావంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని