
Anand Mahindra: ఇక్కడ మా వాహనాలే కాదు.. పెద్దపులులూ తిరుగుతాయి
ముంబయి: వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉంటూ.. సమయస్పూర్తితో వ్యవహరిస్తుంటారు. తరచూ పలు వీడియోలు, ఫొటోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. అందులో నవ్వించేవి, ఆలోచింపజేసేవి, వర్తమాన అంశాలు ఉంటాయి. వీటితో పాటు అప్పుడప్పుడూ ఆయన సంస్థకు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాలకు సంబంధించి మార్కెటింగ్ కూడా వినూత్నంగా నిర్వహిస్తుంటారు. మహీంద్రా ఎక్స్‌యూవీ500 వాహనానికి సంబంధించిన ఓ ప్రకటనను గుర్తుకుతెచ్చేలా.. తాజాగా రోడ్డుపై పులులు సంచరిస్తున్న వీడియోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘రోడ్ల మీద మా ఎక్స్‌యూవీ వాహనాలే కాదు, పెద్దపులులు కూడా సంచరిస్తాయి.. అద్భుతం’ అంటూ ట్వీట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా పంచుకున్న ఈ వీడియోలో.. ఓ అభయారణ్యంలోని రెండు పులులు రోడ్డు పైకి వస్తాయి. అక్కడే కలియతిరుగుతాయి. వాటిని చూసిన వాహనదారులు రోడ్డుపైనే నిలిచిపోతారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఈ దృశ్యాలు ఎక్కడ చిత్రీకరించారో స్పష్టత లేదు. కాగా ఈ విషయమై నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ వీడియోను ఈ మధ్యే మహాబలేశ్వరం-పంచ్గని రోడ్డుపై చిత్రీకరించారని కొందరు పేర్కొంటున్నారు. ఈ దృశ్యాలను మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ సమీపంలో చిత్రీకరించారని కొందరు అంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని పెంచ్ జాతీయ పార్కులోని దృశ్యాలని మరికొందరు వెల్లడిస్తున్నారు.