Anand Mahindra: అతని గురించి ఇప్పటిదాకా తెలియదు.. ఇకపై తప్పకుండా ఫాలో చేస్తా!

భారతీయ ఆర్చరీ ఆటగాడు ప్రథమేశ్ సమాధాన్‌ జావ్‌కర్‌ (Prathamesh Samadhan Javakar) ఆటతీరును అభినందిస్తూ ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) షేర్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

Published : 21 May 2023 22:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉంటారు. అంతేకాదు, ప్రేరణ కలిగించే ఎంతో మంది జీవిత కథలను ట్విటర్‌లో షేర్‌ చేస్తుంటారు. తాజాగా, భారతీయ ఆర్చరీ ఆటగాడు ప్రథమేశ్ సమాధాన్‌ జావ్‌కర్‌ (Prathamesh Samadhan Javakar) ఆటతీరును అభినందిస్తూ ఓ వీడియోను షేర్‌ చేశారు.

ప్రథమేశ్‌ ప్రతిభ గురించి చెబుతూ.. సుధీర్‌ అనే కోచ్‌ ఓ వీడియోను షేర్‌ చేశారు. ‘‘ధనస్సు, బాణాలతో శ్రీరాముడు, అర్జునుడు వంటి గొప్పవారు నడిచిన నేల ఇది. అలాంటి చోట విలువిద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 19ఏళ్ల ప్రథమేశ్‌ సమాధాన్‌ గురించి మీలో ఎంతమందికి తెలుసు? షాంఘైలో జరిగిన 2023 ప్రపంచకప్‌ ఆర్చరీ పోటీల్లో ఇతనే కొత్త ప్రపంచ ఛాంపియన్‌. అతని ఏకాగ్రత, దృష్టి అమోఘం. అతని నైపుణ్యం ఈ వీడియోలో చూడండి’’ అంటూ వీడియోను షేర్‌ చేశారు. 

ఈ వీడియోను చూసిన ఆనంద్‌ మహీంద్రా.. ప్రథమేశ్‌ ప్రతిభను మెచ్చుకుంటూ వీడియోను రీట్వీట్ చేశారు. ‘‘ఎంతో అపురూపం. ఇతనిలో స్టీల్‌తో చేసిన నరాలు, లేజర్‌ అంత పదునైన దృష్టి ఉన్నాయనుకుంటా. ఛాంపియన్‌ తయారవుతున్నాడు. మీరు చెప్పింది నిజమే సుధీర్‌. ఇప్పటివరకు ఇతని గురించి నేను వినలేదు. ఇకపై ఇతన్ని తప్పక అనుసరిస్తా. సెప్టెంబరులో హెర్మొసిల్లోలో జరిగే ఫైనల్లో అతను తప్పక విజయం సాధిస్తాడు’’ అంటూ మహాంద్రా ట్వీట్ చేశారు.  ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం ప్రథమేశ్‌ ప్రతిభను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 19 ఏళ్ల ప్రథమేశ్‌ ఆదివారం షాంఘై వేదికగా జరిగిన 2023 ఆర్చరీ ప్రపంచకప్‌ పోటీల్లో కాంపౌండ్‌ మెన్‌ విభాగంలో బంగారు పతాకాన్ని గెలిచి ఛాపింయన్‌గా అవతరించాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని