Viral: చిన్నారి బ్యాటింగ్‌.. ఆనంద్‌ మహీంద్రా ఫిదా! 

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తరచూ సరదా సన్నివేశాలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. అందులో నవ్వించేవి, ఆలోచింపజేసేవి, వర్తమాన అంశాలు.. ఇలా అనేకం ఉంటుంటాయి. తాజాగా....

Updated : 12 Jun 2021 18:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తరచూ సరదా వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. అందులో నవ్వించేవి, ఆలోచింపజేసేవి, వర్తమాన అంశాలు.. ఇలా అనేకం ఉంటుంటాయి. తాజాగా ఆయన ఓ ఆరేళ్ల చిన్నారి క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. ‘ద బెటర్‌ ఇండియా’ తొలుత పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో ఆరేళ్ల  చిన్నారి బ్యాటింగ్‌ నైపుణ్యం చూసి ఫిదా అయిపోయిన ఆనంద్‌.. తన ఫాలోవర్లతో పంచుకున్నారు. అంతేకాదు, తన ట్వీట్‌కు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజుజుని ట్యాగ్‌ చేశారు.

29 సెకన్ల నిడివి కలిగిన ఈ వైరల్‌ వీడియోలో చిన్నారి అద్భుతమైన బ్యాటింగ్‌ నైపుణ్యం ఆనంద్‌ మహీంద్రాను ఫిదా చేసిందట. కాగా, ఆ చిన్నారి కేరళలోని కోజికోడ్‌కు చెందిన మెహక్‌ ఫాతిమాగా గుర్తించారు. ఆమెను భవిష్యత్తు సూపర్‌ స్టార్‌గా పేర్కొన్న ఆనంద్‌.. ఈ చిన్నారి గురించి కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు దృష్టికి తీసుకెళ్లడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా సాకర్‌ లేదా బాస్కెట్‌ బాల్‌కు సంబంధించి పిల్లలు చేసే అద్భుతాలు తనకు ఫార్వార్డ్‌ అవుతుంటాయన్నారు. ఈ చిన్నారి మన భవిష్యత్తు సూపర్‌ స్టార్‌ అని పేర్కొంటూ ఆమెపై దృష్టి పెట్టాలని కోరుతూ కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజును తన ట్వీట్‌కు ట్యాగ్‌ చేశారు. ఆమె టాలెంట్‌ను వృథా కానివ్వొద్దని కోరారు.

మరోవైపు, అద్భుతమైన బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఫాతిమా వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ చిన్నారి ఆట తీరు చూస్తుంటే ప్రొఫెషనల్‌గా సిద్ధమైనట్టు కనబడుతోందని పలువురు ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు పెడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని