Andhra News: కేరళలో ఏపీ యాత్రికుల బస్సు ప్రమాదం.. ఆరా తీసిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు ప్రయాణిస్తున్న శబరిబల యాత్ర బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. సీఎంఓ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

Updated : 19 Nov 2022 17:45 IST

కేరళ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు ప్రయాణిస్తున్న శబరిమల యాత్ర బస్సు కేరళలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. సీఎంవో అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన భక్తులు శబరిమల యాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా కేరళలోని పతనంథిట్ట సమీపంలోని మలుపు వద్ద స్కిడ్‌ అయి బోల్తా పడిందని అధికారులు సీఎంకు వివరించారు. 84 మంది భక్తులు రెండు బస్సుల్లో శబరిమల వెళ్లారని.. తిరిగి వస్తున్న సమయంలో ఇవాళ ఉదయం 8గంటలకు ఒక బస్సు ప్రమాదానికి గురైందని చెప్పారు. ప్రమాదానికి గురైన బస్సులో 44 మంది ప్రయాణికులు ఉన్నారని.. వారిలో 40మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురికి పథనాంతిట్ట వైద్యశాలలో చికిత్స అందిస్తున్నట్లు సీఎంకు వివరించారు. మిగిలిన యాత్రికులకు వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నామని.. పతనంథిట్ట అధికారులతో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సీఎంవో అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులకు ఇబ్బంది లేకుండా వైద్యంతోపాటు సరైన సహాయం అందేలా చూడాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని