YS Jagan: ప్రజలకు చేరువగా హెల్త్‌హబ్స్‌

రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసే హెల్త్‌ హబ్స్‌ జనావాసాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Updated : 14 Jun 2021 19:57 IST

అమరావతి: రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసే హెల్త్‌ హబ్స్‌ జనావాసాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, థర్డ్‌వేవ్‌, హెల్త్‌హబ్స్‌ తదితర అంశాలపై అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో శిశువులు, చిన్నారుల వైద్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో గణనీయంగా కేసులు తగ్గుముఖం పట్టాయని, మే 16న 25.56శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు జూన్‌ 12న 6.58 శాతానికి తగ్గిందని అధికారులు సీఎంకు వివరించారు. ఏడు జిల్లాల్లో పాజిటివిటీ రేటు 0-9శాతం లోపే ఉందని తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2,303 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయని, చికిత్స పొందుతూ 157 మంది మృతి చెందారని వివరించారు.

థర్డ్‌వేవ్‌ వార్తల నేపథ్యంలో చిన్నారులు, శిశువులకు అత్యుత్తమ వైద్యం అందించాలని సీఎం ఆదేశించగా, మొత్తంగా 1600 ఐసీయూ బెడ్లు ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అదేవిధంగా ఇప్పుడున్న ఆక్సిజన్‌ బెడ్‌లతో కలిపి 3,777 పడకలు ఏర్పాటు చేస్తామన్నారు.  అదనంగా చిన్నపిల్లల వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, సహాయక సిబ్బందిని తీసుకునేలా ప్రణాళిక సిద్ధం చేశామని సీఎం దృష్టికి తీసుకెళ్లగా, నెలరోజుల్లోగా ఈ పనులు పూర్తిచేయాలని జగన్‌ ఆదేశించారు. పీడియాట్రిక్‌ అంశాల్లో నర్సులకు, సిబ్బందికి చక్కటి శిక్షణ ఇవ్వాలని, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. నగరాలు, పట్టణాలకు నలువైపులా ఆస్పత్రులు తీసుకురావాలని సూచించారు. దీనివల్ల ప్రజలకు చేరువలో ఆస్పత్రులు ఉంటాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని