Corona: ఏపీలో 20వేలు దాటిన కేసులు

24 గంటల వ్యవధిలో 1,05,494 నమూనాలను పరీక్షించగా.. 22,164 మందికి పాజిటివ్‌

Updated : 09 May 2021 18:51 IST

అమరావతి: ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య 20 వేలు దాటేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,05,494 నమూనాలను పరీక్షించగా.. 22,164 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కరోనా మహమ్మారి కారణంగా తాజాగా 92 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాకు వెల్లడించారు. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు  12,87,603 కేసులు నమోదవ్వగా.. మరణాలు 8,707కి పెరిగాయి.  తాజాగా 8,832 మంది వైరస్‌ నుంచి కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 1,90,632 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలోని 637 కొవిడ్‌ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న 6,870 ఐసీయూ బెడ్లలో 6,323 ఇప్పటికే నిండిపోయినట్లు సింఘాల్‌ వివరించారు. రాష్ట్రంలో 23,259 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉండగా.. 22,265 నిండాయన్నారు. వ్యాక్సిన్ల కొరత ఉండటం వల్ల 45 ఏళ్లు మించిన వారికే  వాక్సిన్ వేసేందుకు  కేంద్రాన్ని అనుమతి కోరగా.. సానుకూలంగా స్పందించిందని సింఘాల్‌ అన్నారు. దీనికి అనుగుణంగా మరో రెండు రోజుల్లో  కొవిన్‌ వెబ్‌ పోర్టల్లో మార్పులు చేస్తామన్నారు.

కొవిడ్‌  విధులు నిర్వర్తించేవారికి రెగ్యులర్‌ నియామకాల్లో 15 శాతం వరకు  వెయిటేజీ ఇస్తామని సింఘాల్‌ తెలిపారు. 6నెలలు సేవ చేస్తే.. 5మార్కులు,  ఏడాదికి 10 మార్కులు, ఏడాదిన్నకు 15 మార్కులు కేటాయిస్తామన్నారు. ఎవరికి ఎప్పుడు వాక్సిన్ వేస్తున్నామనే విషయాన్ని స్పష్టంగా చెప్పామని, రెండో డోసు వాక్సినేషన్‌కు మాత్రమే సరిపడా వ్యాక్సిన్‌ ప్రస్తుతం అందుబాటులో ఉందని అన్నారు. మొదటి డోసు టీకా ఎప్పటి నుంచి ఇస్తామన్న విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని