చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వు!

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి.

Updated : 19 Sep 2023 19:56 IST

అమరావతి: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు(AP High court)లో వాదనలు ముగిశాయి. మంగళవారం మధ్యాహ్నం 12గంటల నుంచి దాదాపు ఐదు గంటల పాటు వాదనలు హోరాహోరీగా కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. 

ఈ కేసులో ఇరు పక్షాల తరఫున మొత్తం ఐదుగురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా కొనసాగిన వాదనల్లో పలు కీలక అంశాలను న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ, అసలు ఈ కేసులో అవకతవకలు జరిగాయా? లేదా? డబ్బులు పోయాయని ఒకవైపు సీఐడీ ఆరోపిస్తున్నప్పటికీ.. అసలు ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో ఆధారాలు చూపకపోవడం, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఇప్పటికీ తెరిచే ఉండటం, వాటిలో యువతకు శిక్షణ సైతం కొనసాగుతున్న పరిస్థితులను కోర్టుకు వివరించారు. ఎన్నికల వేళ కావాలనే కుట్రపూరితంగా ఈ కేసులో చంద్రబాబును ఇరికించారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఫిర్యాదే ఓ అభూత కల్పన అని, ఎఫ్‌ఐఆర్‌ చట్టవిరుద్ధంగా ఉందంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ్‌ లూథ్రా హైకోర్టు ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు.

మరోవైపు, అటు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ప్రధానంగా షెల్‌ కంపెనీల ద్వారా నగదు వెళ్లిందని.. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాల్సి ఉందని బెంచ్‌ ముందు వాదనలు వినిపించారు.  ఈ దశలో కోర్టులు కలుగజేసుకోరాదన్నారు. ఈ కేసులో చంద్రబాబుకు 17ఎ వర్తించదని వాదించారు. కార్పొరేషన్‌ సంబంధించి న్యాయవాదులు కౌంటర్‌ దాఖలు చేయాలని.. వాళ్లను సైతం చేర్చుకొనేందుకు మరో వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. అన్ని వాదనలు ఈరోజే పూర్తిచేయాలని ఒక దశలో బెంచ్‌ అనడంతో కౌంటర్‌ వాదనలు ఈరోజే వినిపించడంతో ఇరువైపుల వాదనలు ముగిశాయి. దీంతో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

ఏసీబీ కోర్టులో పిటిషన్లపై విచారణ 21కి వాయిదా

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉన్నందున అటు ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ పిటిషన్లపైనా విచారణ వాయిదా పడింది. పిటిషన్లపై విచారణను ఈ నెల 21కు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. హైకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ విచారణ దృష్ట్యా విచారణ వాయిదా పడింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని