AndhraPradesh : పీఆర్సీ నుంచి ఎక్కువగా ఆశించడం వల్లే అసంతృప్తి : సజ్జల

ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం

Published : 04 Feb 2022 02:19 IST

అమరావతి: ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సజ్జల విలేకర్లతో మాట్లాడుతూ.. ఉద్యోగులను చర్చలకు రోజూ పిలుస్తున్నా రావట్లేదన్నారు. ఉద్యోగులకు సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశం లేదనిపించిందని చెప్పారు. బలప్రదర్శన చేయడం ద్వారా సమస్య జఠిలమవుతుందని పేర్కొన్నారు. వరుస చర్చల సమయంలో పరిస్థితి వివరించినా అర్థం చేసుకోలేదన్నారు. సీఎం దృష్టికి ఏదొచ్చినా ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్ధమని సీఎం చెప్పారన్నారు.

కొవిడ్ వల్ల రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలియదని సజ్జల వివరించారు. మరోవైపు సంక్షేమానికి కూడా నిధులు అవసరమని తెలిపారు. పీఆర్సీ ఏ విధంగా రూపొందించిందో ప్రభుత్వం వివరించిందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మంచి ప్యాకేజీ ఇచ్చామన్నారు. పీఆర్సీ నుంచి ఎక్కువగా ఆశించటం వల్లే అసంతృప్తి నెలకొందని వ్యాఖ్యానించారు. పొరుగు సేవల సిబ్బందికి ఠంఛనుగా జీతాలు ఇస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగులు తమ వారే అనుకుని ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. దశాబ్దాలుగా తక్కువ జీతాలున్న అంగన్‌వాడీలకు, ఆశా, మున్సిపల్ వర్కర్లకు గత ప్రభుత్వాల కంటే మంచి జీతాలిచ్చామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు 7-8 విషయాల్లో ఉపకారం చేశామన్నారు. ఉద్యోగ భద్రత గత ప్రభుత్వంలో లేదని, తామే కల్పించామని తెలిపారు.

ఐఆర్‌ కంటే (27శాతం) ఎక్కువ చేయాలని ఉన్నా సంక్షేమం వల్ల చేయలేదని సజ్జల వెల్లడించారు. సంక్షేమానికి దోచి పెడుతున్నామనడంలో అర్థం లేదని, ప్రభుత్వం ఎక్కడైనా దుబారా చేస్తుంటే చెప్పాలని సజ్జల సూచించారు. జీతాల్లో ఎవరికీ కోతల్లేవు.. ఉంటే వచ్చి అడగాలని చెప్పారు. సమ్మె వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తితే చూస్తూ ఊరుకోబోమని సజ్జల స్పష్టం చేశారు.  సమ్మె చేస్తే ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదని, సమ్మెకు వెళ్తే ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు ఖాయమని స్పష్టం చేశారు. సీఎంతో కాకుండా ముందుగా మంత్రుల కమిటీతో చర్చలు జరపాలని సజ్జల తెలిపారు. జీతాలు ఖాతాల్లో పడ్డాక జీవోలు రద్దు అనడం అర్థం లేని డిమాండ్‌గా పేర్కొన్నారు. రాజకీయ పార్టీల జోక్యంతో ఉద్యమం పక్కదారి పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఉద్యోగుల గొంతు నొక్కే పని ఏదీ చేయదని వెల్లడించారు. కరోనా ఆంక్షల వల్లే ‘చలో విజయవాడ’కు అనుమతి ఇవ్వలేదన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని