Vaccination: వ్యాక్సినేషన్‌లో ఏపీ రికార్డు

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. ఒక్కరోజులోనే 9 లక్షల నుంచి 10 లక్షలకుపైగా వ్యాక్సిన్‌ డోసులు వేయాలనే లక్ష్యంతోనే రాష్ట్రంలో మొదలుపెట్టిన మాస్‌ వ్యాక్సినేషన్‌..

Updated : 20 Jun 2021 22:05 IST

అమరావతి: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. ఒక్కరోజులోనే 9 లక్షల నుంచి 10 లక్షలకుపైగా వ్యాక్సిన్‌ డోసులు వేయాలనే లక్ష్యంతోనే రాష్ట్రంలో మాస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇవాళ ఒక్కరోజే 13.45 లక్షల మందికి టీకాలు ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. ఒకే రోజు ఆరు లక్షల మందికి టీకా ఇచ్చిన గత రికార్డును రాష్ట్రం అధిగమించినట్లు వెల్లడించారు. వ్యాక్సిన్‌ సామర్థ్యానికి అనుగుణంగా వ్యాక్సిన్‌ డోసులను కేంద్రం అందించగలిగితే ఏపీకి ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్‌ డోసులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 96 లక్షల మందికి మొదటి డోసు డోసు వేసినట్లు అనిల్‌ సింఘాల్‌ చెప్పారు.

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని అనిల్‌ వెల్లడించారు. థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. థర్డ్‌ వేవ్‌ పిల్లలపై అధిక ప్రభావం చూపుతుందనేది నిజం కాకపోవచ్చన్నారు. పిల్లలపై థర్డ్‌ వేవ్‌ ప్రభావమనే ఉహాగానాలను ఎయిమ్స్‌ వైద్యులు కొట్టిపారేస్తున్నారని పేర్కొన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఔషధాలు, ఇంజెక్షన్లు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు 60వేల ఆంఫోటెరిసిన్‌-బి ఇంజెక్షన్లను ఆర్డర్‌ చేసినట్లు అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. ఆస్పత్రుల్లో పీయూసీ ప్లాంట్ల ఏర్పాటును పూర్తి చేస్తామన్నారు. 10 వేల డి-టైప్‌ సిలిండర్లు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని