Telangana DGP: తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్‌కు అదనపు బాధ్యతలు

తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌కు సీఐడీ డీజీగా నియమించారు. 

Updated : 29 Dec 2022 20:45 IST

హైదరాబాద్‌:  మహేందర్ రెడ్డి తర్వాత డీజీపీ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. దాదాపు ఐదారు నెలలుగా జరుగుతున్న చర్చకు పుల్ స్టాప్ పెడుతూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. పోలీస్‌ బాస్‌గా అంజనీకుమార్‌ నియమితులయ్యారు. అవినీతి నిరోధకశాఖ డీజీగా ఉన్న అంజనీకుమార్‌ను ఇన్‌ఛార్జి డీజీపీగా బదిలీ చేస్తూ జీవో వెలువడింది.

అంజనీ కుమార్‌తో పాటు మరో ఐదుగురు ఐపీఎస్‌లను సైతం ప్రభుత్వం బదిలీ చేసింది. ఏసీబీ, విజిలెన్స్‌ డీజీగా ఉన్న అంజనీకుమార్‌కు పోలీసుశాఖ బాధ్యతలు అప్పగించింది. డీజీపీగా నియమిస్తారనే విషయంలో పలు పేర్లు చర్చకు వచ్చాయి. అంజనీకుమార్‌తో పాటు రవిగుప్త, సీవీ ఆనంద్‌ పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. హోంశాఖ కార్యదర్శిగా ఉన్న రవిగుప్త, హైదరాబాద్‌ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌లను సైతం ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. చివరికి సీనియారిటీలో ముందు వరుసలో ఉండటంతో పాటు, శాంతిభద్రతల అదనపు డీజీగా, హైదరాబాద్‌ సీపీగా, ఏసీబీ డీజీగా పనిచేసిన అనుభవం ఉన్న అంజనీకుమార్‌ వైపే కేసీఆర్‌ మొగ్గు చూపారు.  హైదరాబాద్‌ సీపీగా పనిచేసిన సమయంలో అంజనీకుమార్‌ తనదైన ముద్ర వేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సైతం హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రశాంతంగా ముగిసేలా తనవంతు పాత్ర పోషించారు. కరోనా సమయంలోనూ పోలీసులను సన్నద్ధం చేసి ముందుండి నడిపించారు. నాలుగేళ్లపాటు హైదరాబాద్‌ సీపీగా పనిచేసిన అంజనీకుమార్‌ వివాదరహితుడిగా పనిచేశారు.  

బిహార్ రాష్ట్రం పట్నాలో 1966 జనవరి 28న అంజనీకుఆమర్‌ జన్మించారు. 1990 బ్యాచ్ ఐపీఎస్‌ అధికారిగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. పోలీస్ శాఖలో మంచి పోస్టింగులలో పని చేశారు. ఆయన పలు అవార్డులు సైతం దక్కించుకున్నారు. ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ (పీస్ మెడల్) రెండుసార్లు అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి తరపున 1998-99లో బోస్నియా దేశంలో పనిచేశారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, నక్సల్ ప్రాంతంలో పనితీరుకు గానూ అంతరిక్ సురక్ష మెడల్ అందుకున్నారు. బిహార్ రాజధాని పట్నాలోని సెయింట్ జేవియర్ స్కూల్లో, దిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని