AP Reorganisation: విద్యుత్‌ బకాయిలపై చర్చ లేకుండానే ముగిసిన ‘విభజన’ పంచాయితీ

విభజన సమస్యల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వివిధ

Updated : 27 Sep 2022 17:18 IST

దిల్లీ: విభజన సమస్యల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వివిధ అంశాలను ఏపీ, తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. రాజధానికి మరో రూ.1000 కోట్లు కావాలని ఏపీ కోరగా.. ఇప్పటికే ఇచ్చిన రూ.1500కోట్ల ఖర్చుల వివరాలు ఇవ్వాలని హోంశాఖ సూచించింది. రాజధాని కోసం శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రూ.29వేల కోట్లు ఇవ్వాలని అడగ్గా.. హోంశాఖ అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పాటు రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాలకు నిధులు ఇవ్వాలని ఏపీ అధికారులు కోరగా.. ఐదేళ్లే ఇవ్వాలని నిర్ణయం జరిగిందని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. 

మరోవైపు షీలా బిడే కమిటీ సిఫార్సులపై న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటామని కేంద్రహోంశాఖ అధికారులు చెప్పారు. అయితే ఆ కమిటీ సిఫార్సులను తెలంగాణ ఒప్పుకోవడం లేదన్నారు. తెలంగాణ అంగీకరించకపోయినా హోంశాఖ నిర్ణయం తీసుకోవచ్చు కదా? అని ఏపీ అధికారులు ప్రశ్నించగా.. దీనిపై న్యాయనిపుణుల సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. ఏపీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సహా పలు సంస్థల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. పౌరసరఫరాల శాఖ బకాయిల అంకెల్లో తేడాలు ఉన్నాయని ఏపీ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్‌ బకాయిల అంశం చర్చకు రాలేదు. మరోసారి భేటీ కావాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది.

90 సంస్థల విభజనకు కమిటీ సిఫారసు: తెలంగాణ

కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో జరిగిన చర్చలపై తెలంగాణ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ‘‘షెడ్యూల్‌ 9లోని సంస్థల విభజనకు షీలాబిడే కమిటీ సిఫార్సులు చేసింది. మొత్తం 90 సంస్థల విభజనకు కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు వివాద పరిష్కారానికి హోంశాఖ ఉప కమిటీని నియమించింది. 90 సంస్థలను 3 భాగాలుగా విభజించారు. 53 ప్రభుత్వ రంగ సంస్థల విభజనకు ఏకాభిప్రాయం ఉంది. 15 సంస్థలకు తెలంగాణ అంగీకరిస్తే.. ఏపీ ఒప్పుకోలేదు. 22 సంస్థల విషయంలో తెలంగాణ అంటీకారం లేదు. అంగీకరించని వాటిపై తెలంగాణ హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు పరిధిలోని అంశాలపై న్యాయశాఖతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది’’ అని తెలంగాణ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని