Cabinet Decisions: ఐదేళ్లలో ఒక్క టీచర్‌ పోస్టూ భర్తీ చేయలేదు: మంత్రి పార్థసారథి ధ్వజం

ఏపీ క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు.

Updated : 24 Jun 2024 17:07 IST

విజయవాడ: గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను దగా చేసిందని మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ పేరిట అన్ని స్కూళ్లలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి క్యాబినెట్‌ ఆమోదించిందని వెల్లడించారు. క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘‘గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఎన్నికల ముందు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు తీరని నష్టం చేసింది. టెట్‌ పరీక్షను ప్రతి ఆర్నెళ్లకోసారి నిర్వహించాల్సి ఉండగా.. అలా చేయకపోవడం వల్ల వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయారు. టెట్‌లో తమ మార్కులు ఇంప్రూవ్‌ చేసుకొనే అవకాశం కోల్పోయారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని సీఎం ఆదేశించారు’’ అని వివరించారు. 

ఆ చట్టం చూస్తే చాలు.. గత పాలనేంటో తెలుస్తుంది!

‘‘ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం చూస్తే చాలు.. గత ప్రభుత్వ పాలన ఏంటో తెలుస్తుంది. కేంద్రం చెప్పిన దానికి రాష్ట్రం అమలు చేసిన దానికీ అసలు పొంతన లేదు. భాజపా పాలిత రాష్ట్రం ఏ ఒక్కటీ ఈ చట్టాన్ని అమలు చేయలేదు. ఈ చట్టం వల్ల సన్న, చిన్నకారు రైతులు సమస్యలు ఎదుర్కొన్నారు. వివాదాలు వస్తే అప్పిలేట్‌ అథారిటీ ఎవరో చెప్పలేదు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంలో నేరుగా హైకోర్టుకే జ్యురిస్‌డిక్షన్‌ ఇచ్చారు. పేద రైతు ఎవరైనా ఖర్చులు భరించి హైకోర్టుకు వెళ్లగలరా? ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం రద్దు నిర్ణయాన్ని క్యాబినెట్‌ ఆమోదించింది. రైతులందరికీ ఒరిజినల్‌ డాక్యుమెంట్లు ఇస్తాం’’ అన్నారు.

ఇంటికే వెళ్లి పింఛను అందిస్తాం

‘‘పింఛను పెంచిన మొత్తాన్ని రూ.4 వేలు జులై 1 నుంచి ఇస్తాం. పింఛను పెంపు వల్ల 65 లక్షల మందికి లబ్ధి జరుగుతోంది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేస్తాం. కొన్ని రకాల వ్యాధి బాధితులకు రూ.10వేలు పింఛను ఇస్తాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. వ్యవసాయ రంగంలోనూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అమలు చేస్తాం. గంజాయి నియంత్రణకు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయగా.. ఈ కమిటీలో సభ్యులుగా  హోం, విద్య, ఎక్సైజ్‌, గిరిజనశాఖ మంత్రులు ఉంటారు. గంజాయి సమస్యను అరికట్టేందుకు కట్టుబడి ఉన్నాం. రాష్ట్రంలో గంజాయి అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకున్నాం. కమిటీ ఇచ్చిన సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.

ఒకేసారి 183 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం

పేదవాడికి నాణ్యమైన భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తున్నాం. రూ.5కే భోజనం అందించేలా మొదట 183 అన్న క్యాంటీన్లను ఆగస్టు నుంచి ప్రారంభిస్తాం.. త్వరలో మరో 20 అన్న క్యాంటీన్లను తెరుస్తాం. వైఎస్‌ఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరును ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీగా మార్చాం. వర్సిటీ పేరు మార్పు వల్ల వైద్యులు అనేక ఇబ్బందులు పడ్డారు. దీంతో వైద్యులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు ఆ పేరును మార్పు చేశాం. రాష్ట్రంలో నైపుణ్య గణన కార్యక్రమానికి, రాష్ట్ర ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమిస్తూ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది’’ అని మంత్రి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని