Ap Cabinet: ఈ ఏడాది ముందుగానే వ్యవసాయ సీజన్‌.. ఏపీ కేబినెట్‌ నిర్ణయాలివే!

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగంపై రాష్ట్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది ముందుగానే వ్యవసాయ సీజన్‌ను ప్రారంభించి.. గతంలో కంటే ముందే కృష్ణా, గోదావరి

Updated : 12 May 2022 20:51 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగంపై రాష్ట్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది ముందుగానే వ్యవసాయ సీజన్‌ను ప్రారంభించి.. గతంలో కంటే ముందే కృష్ణా, గోదావరి జలాలు విడుదల చేయాలని నిర్ణయించింది. గోదావరి డెల్టాకు జూన్‌ 1న, కృష్ణా డెల్టాకు జూన్‌ 10న, రాయలసీమ ప్రాజెక్టుల నుంచి జులై 30న నీరు విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతులు ఖరీఫ్ సీజన్‌ను ముందే ప్రారంభిస్తే.. నవంబర్‌లో తుపానులు వచ్చేనాటికి పంట చేతికి వస్తుందని కేబినెట్‌ అభిప్రాయపడింది. ఈ మేరకు వ్యవసాయరంగంపై మంత్రివర్గంలో తీసుకున్న కీలక నిర్ణయాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు.

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయికి వెళ్తున్న ప్రజాప్రతినిధులను ప్రజలు స్వాగతిస్తున్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఏదో ఒక లబ్ధి కలిగిందన్నారు. సుదీర్ఘకాలంగా పెండిగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని శ్రద్ధతో చేయాలని చెప్పారన్నారు. ప్రతీ ఇంటికీ శాసనసభ్యులు వెళ్లాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారని పేర్కొన్నారు. చెప్పింది చేశామన్న అంశాలను ప్రజలకు వివరించటంలో ఏమాత్రం అలసత్వం వద్దని సీఎం సూచించినట్లు చెప్పారు.

కేబినెట్‌ ఆమోదం తెలిపిన నిర్ణయాలివే..

* సంక్షేమానికి ప్రకటించిన క్యాలెండర్‌ ప్రకారమే రాష్ట్రంలో పథకాల అమలుకు ఆమోదం.

* మే 13న కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మత్స్యకార భరోసా పథకం ప్రారంభం.

* మే 16న రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.5,500 జమ.

* మే 31న ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రెండు దఫాలుగా రూ.7,500 వేసేందుకు నిర్ణయం.

* జూన్ 19న యానిమల్ అంబులెన్సుల ప్రారంభోత్సవం.

* జూన్ 6న కమ్యూనిటీ హైరింగ్ పథకం కింద 3వేల ట్రాక్టర్లు, 402 హార్వెస్టర్ల పంపిణీ.

* జూన్ 14న వైఎస్‌ఆర్‌ పంటల బీమా కింద 2021 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు బీమా చెల్లింపు.

* జూన్ 21న అమ్మ ఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధుల బదిలీ.

* జూన్ 1న వ్యవసాయానికి సాగునీటి విడుదల ప్రణాళికను ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం.

* 2022-27 సంవత్సరాలకు సంబంధించి ఎగుమతుల ప్రోత్సాహక విధానానికి ఆమోదం.

* 2022-27 ఏపీ లాజిస్టిక్ పాలసీ, ప్రోత్సాహకాలకు ఆమోదం.

* నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్‌కో సంస్థ ద్వారా బయో ఇథనాల్ తయారీకి ఆమోదం.

* వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు, రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 1600 కోట్ల రుణ సమీకరణ.

* ప్రతీ జిల్లా కేంద్రం, కార్పొరేషన్‌లో అత్యాధునిక వైద్య సౌకర్యాల కోసం మెడికల్ హబ్‌ల ఏర్పాటు.

* ప్రవేటు రంగంలో కనీసం వంద పడకలు ఉండేలా ఆస్పత్రుల నిర్మాణం.

* మచిలీపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, కొత్తూరు, కడప జిల్లాలో అత్యాధునిక ఆస్పత్రుల నిర్మాణం కోసం భూ కేటాయింపు.

* నెల్లూరు జిల్లాలో టెక్స్ టైల్ పార్కు కోసం భూ కేటాయింపు చేస్తూ కేబినెట్ నిర్ణయం.

* నర్సాపురంలో రైతుల స్వాధీనంలో భూములకు హక్కులు కల్పిస్తూ మంత్రివర్గం ఆమోదం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని