Cm Jagan: ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వ్యాప్తి తగ్గినందున రాత్రి కర్ఫ్యూను తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు

Published : 15 Feb 2022 01:54 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వ్యాప్తి తగ్గినందున రాత్రి కర్ఫ్యూను తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. కర్ఫ్యూ తొలగించినా కొవిడ్ బారిన పడకుండా మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టిన ఉద్యోగ నియామక ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై సీఎం సమీక్షించారు. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కొవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తి గణనీయంగా పడిపోయిందని అధికారులు సీఎంకు తెలిపారు. యాక్టివ్ కేసుల రేటు 0.82 శాతానికి పడిపోయిందన్నారు. రాత్రి కర్ఫ్యూను తొలగించినప్పటికీ ప్రజలంతా మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా మార్గదర్శకాలు కొనసాగాలని ఆదేశించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫీవర్‌ సర్వే కొనసాగిస్తూ, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేసే ప్రక్రియ కొనసాగించాలని సీఎం ఆదేశించారు.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సమీక్షించిన సీఎం.. వాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 3,90,83,148 మందికి రెండు డోసులు టీకాలు వేసినట్లు అధికారులు తెలిపారు. 39,04,927 మందికి ఒక డోసు వేసినట్లు అధికారులు వివరించారు. వైద్యారోగ్య శాఖలో నియామకాల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఆస్పత్రుల్లో పరిపాలనా బాధ్యతలు, చికిత్స బాధ్యతలను వేరు చేయాలని అధికారులకు సూచించారు. అందులో నిపుణులైన వారికి పరిపాలనా బాధ్యతలను అప్పగించాలని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. స్పెషలిస్టు వైద్యులకు ఇస్తున్న మూలవేతనంలో 50 శాతం, వైద్యులకు 30 శాతం మేర ప్రత్యేక ప్రోత్సాహకంగా ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించినట్లు అధికారులు సీఎంకు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని