Published : 03 Mar 2022 01:47 IST

Cm Jagan: విద్యా రంగంలో సమూల మార్పునకే ఆంగ్ల మాధ్యమం: సీఎం జగన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో  అభివృద్ధి కోసం నాబార్డు మరింత సహకారం అందించాలని సీఎం కోరారు. వ్యవసాయం చేస్తూ అర్హత ఉన్న ప్రతి రైతుకి రుణాలు అందాలన్నారు. ఈ మేరకు బ్యాంకులతో సమావేశమై తగిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కరవు ప్రభావిత ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఎంపిక చేసిన ఈ ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. దీనికి నాబార్డు సహా బ్యాంకులు సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో స్టేట్‌ క్రెడిట్‌ సెమినార్‌ 2022-23 జరిగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, సీఎస్‌ సమీర్‌ శర్మ, పలువురు ఉన్నతాధికారులు, నాబార్డు ఛైర్మన్ జి.ఆర్‌. చింతల, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ 2022-23ని సీఎం జగన్‌ విడుదల చేశారు.

‘‘కొవిడ్‌ సవాళ్లు విసిరినా వ్యవసాయ అనుంబంధ రంగాలు 4.16 శాతం ప్రగతిని సాధించాయి. ఏపీని వ్యవసాయరంగంలో అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకు చేదోడుగా నిలుస్తున్నాం. గ్రామ స్థాయిలో ఇ-క్రాపింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం. దీని కోసం అవసరమైన సిబ్బందిని గ్రామ సచివాలయాల్లో నియమించాం. వ్యవసాయ రంగంలో ఇది విప్లవాత్మక చర్య. 147 నియోజకవర్గాల్లో అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేశాం. ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. వ్యవసాయరంగంలో గ్రామస్ధాయిలోనే పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్నాం.  పార్లమెంటు నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సహాయ సహకారాలు కావాలి. ఫుడ్‌ ప్రాసెసింగ్, కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల బలోపేతంపై దృష్టిపెట్టాం. ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లు తీసుకొస్తాం. వీటిని నిర్వహించే నైపుణ్యాలను గ్రామస్థాయిలోనే అభివృద్ధి చేస్తాం.  వ్యవసాయరంగంలో భవిష్యత్తు టెక్నాలజీపై దృష్టిపెడతాం.

నాడు-నేడు ద్వారా విద్య, వైద్య రంగాల్లో వాస్తవికమైన సంస్కరణలు చేపట్టాం. ఆధునిక వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు 16 కొత్త మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తున్నాం. ఇప్పటికే ఉన్న 11 మెడికల్‌ కాలేజీలను నాడు-నేడు కింద అభివృద్ధి చేస్తున్నాం. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నందున మొత్తం 27 మెడికల్ కళాశాలలు వస్తాయి. స్కూళ్లను మెరుగుపరుస్తూ, నాణ్యమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. విద్యా రంగంలో సమూల మార్పుల్లో భాగంగా ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చాం. సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా... తెలుగు, ఆంగ్ల భాషల్లో పాఠ్యపుస్తకాలను ముద్రించాలని నిర్ణయించాం. నాణ్యమైన విద్యను అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాం’’ అని సీఎం జగన్‌ వివరించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని