Cm Jagan: ఆదాయ మార్గాలు అన్వేషించండి: సీఎం జగన్‌

ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో తాడేపల్లిలోని క్యాంపు

Updated : 16 Feb 2022 17:10 IST

అమరావతి: ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. అదనపు ఆదాయం కోసం కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ‘‘ఇందుకోసం వివిధ రాష్ట్రాలు పాటిస్తున్న విధానాలు అధ్యయనం చేసి, అక్కడ ఎలాంటి విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలి. రాష్ట్ర సొంత ఆదాయం పెరిగేందుకు తగిన ఆలోచనలు చేయాలి. ఆదాయ మార్గాలు కార్యరూపంలోకి తేవడంపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వానికి ఆదాయం తేవడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి. పారదర్శక విధానాలు పాటిస్తూ ముందుకు సాగాలి. రాబడి పెంచుకునే క్రమంలో అధికారులు ఎస్‌వోపీలను పాటించాలి.

పెండింగ్‌లో ఉన్న వ్యాట్‌ కేసులను పరిష్కరించడం ద్వారా బకాయిలను రాబట్టుకోవడంపై దృష్టి సారించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల  ప్రక్రియను వీలైనంత త్వరగా వేగవంతం చేయాలి. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్‌ సేవలను సమీక్షించి తగిన మార్పులు, చేర్పులు చేయాలి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వెలుగు చూసిన అవినీతి  ఘటనలు, లోపాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించకూడదు. ఆమేరకు పటిష్టమైన ఎస్‌ఓపీలను అమలు చేయాలి’’ అని సీఎం జగన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎస్‌ సమీర్‌శర్మ, రాష్ట్రమంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని