Andhra News: ఏపీలో ఉగాది నుంచే కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం

ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్లానింగ్‌, రెవెన్యూ, హోంశాఖ అధికారులతో ...

Updated : 10 Feb 2022 22:31 IST

అమరావతి: ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్లానింగ్‌, రెవెన్యూ, హోంశాఖ అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త జిల్లాల్లో అధికారుల విధులకు సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఉగాది నుంచే కలెక్టర్లు, ఎస్పీలు విధులు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలను కొత్త జిల్లాలకు పంపాలని సీఎం అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్‌ వచ్చిన రోజు నుంచే పాలన నిర్వహించాలని సీఎం సూచించారు. ఓఎస్డీ హోదాలో కొత్త జిల్లాలకు ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలే ఉంటారని సీఎం తెలిపారు.

‘‘కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలి. పాలన ప్రారంభమైన తర్వాత ఎలాంటి ఆయోమయం ఉండకూడదు. దీనికోసం సన్నాహకాలను చురుగ్గా, వేగంగా... సమర్థవంతంగా మొదలుపెట్టాలి. ఉగాది నాటికి కొత్త జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాల కేంద్రాల నుంచి పని చేయాలి. ఉద్యోగుల విభజన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, అవసరమైన భవనాల సిద్ధం చేయాలి. కొత్త భవనాల నిర్మాణంపై ప్రణాళికలు ఖరారు చేయాలి. అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు దానిపై నిశిత పరిశీలన చేయాలి. నిర్ణయం తీసుకునే ముందు వారితో మాట్లాడటం చాలా ముఖ్యం’’ అని సీఎం జగన్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కొత్త జిల్లాల మ్యాపులు, జిల్లా కేంద్రాల నిర్ణయం వెనుక తీసుకున్న ప్రాధాన్యతలను అధికారులు సీఎంకు వివరించారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై వస్తున్న అభ్యంతరాలు, సలహాలు, సూచనలు నిశితంగా పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. స్థానిక సంస్థల (జిల్లా పరిషత్‌ల విభజన) విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని న్యాయపరంగా, చట్టపరంగా పరిశీలించి తగిన ప్రతిపాదనలు తయారు చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు.

 కొత్త జిల్లాల ఏర్పాటుపై వస్తున్న అభ్యంతరాలు, ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పునర్‌వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ గత నెల 25న నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ చర్యలు చేపట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. కడపలో రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే, రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అన్ని పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. అనంతపురం జిల్లాలో పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. దీంతో హిందూపురంలో ఆందోళనలు మొదలయ్యాయి.  అన్ని సదుపాయాలు ఉన్న హిందూపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు ఉద్యమిస్తున్నాయి.  నోటిఫికేషన్‌ జారీ చేసిన 30 రోజుల్లోగా జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని