CM Jagan: రైతులకు చేసే చెల్లింపులు పారదర్శకంగా ఉండాలి: జగన్

ఏపీలో ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రైతులకు చేసే చెల్లింపులన్నీ అత్యంత పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు.

Published : 05 Dec 2022 16:15 IST

అమరావతి: ఎంఎస్‌పీ (Maximum Selling Price) కంటే పైసా తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ధాన్యం కొనుగోళ్లపై కొత్త విధానాన్ని తీసుకొచ్చామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ధాన్యం సేకరణలో తొలిసారి మిల్లర్ల ప్రమేయాన్ని తొలగించామన్నారు. ఖరీఫ్‌ ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మిల్లర్ల ప్రమేయం లేని కొత్త విధానం అమలు తీరుపై ఆరా తీశారు. కొత్త విధానం ఎలా అమలవుతోందో అధికారులు గమనించాలన్నారు.

‘‘చిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు చూడాలి. ధాన్యం సేకరణలో ముందుగానే గోనెసంచులు సిద్ధం చేయాలి. రవాణా, కూలీ ఖర్చుల రీయింబర్స్‌లో జవాబుదారీతనం ఉండాలి. రైతులకు మేలు చేసేలా మరింత మెరుగ్గా దీనిని తీర్చిదిద్దాలి. రవాణా, సంచుల ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తోందని రైతులకు వివరంగా చెప్పాలి’’ అని సీఎం అన్నారు. రైతులకు చేసే చెల్లింపులన్నీ అత్యంత పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు. కార్పొరేషన్‌ నుంచి డీబీటీ (Direct Benefit Transfer) పద్ధతిలో డబ్బు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

‘‘డీబీటీ పద్ధతితో చెల్లింపుల ద్వారా పారదర్శకత తీసుకురావచ్చు. అవకతవకలు, అవినీతికి ఆస్కారం లేకుండా ఎస్‌వోపీ(Standard Operating Procedure)లు ఉండాలి. ప్రత్యామ్నాయ పంటల సాగుపైనా రైతులకు అవగాహన కల్పించాలి’’ అని జగన్‌ తెలిపారు. వైకాపా ప్రభుత్వం చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తోందని సీఎం జగన్‌ అన్నారు. అడిగినవారికి పౌరసరఫరాల శాఖ ద్వారా చిరుధాన్యాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని