
CM Jagan: సదరన్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించాలి: జగన్
అమరావతి: ఈనెల 14న జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్ సహా పలు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సహా కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్ఛేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్, పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ కూడా హాజరవుతారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చేలా చూడాలని అధికారుకు సీఎం జగన్ ఆదేశించారు. దీనివల్ల సమావేశంలో చర్చ జరిగి మేలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను అజెండాలో పొందుపరిచామని అధికారులు తెలిపారు.
తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు రూ.6,300 కోట్ల విద్యుత్ బకాయిలు, రెవెన్యూలోటుపై సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. రేషన్ బియ్యంలో హేతుబద్ధతలేని రీతిలో కేంద్రం కేటాయింపులు చేస్తోందన్న సీఎం, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్ సప్లైస్ బకాయిల అంశాలపై చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. ఎఫ్‌డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ ప్రస్తావించాలని నిర్ణయించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్నీ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాలని సన్నాహక సమావేశంలో నిర్ణయించారు. కేఆర్‌ఎంబీ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలన్న అంశాన్ని సమావేశంలో ప్రస్తావించాలని సీఎం నిర్ణయించారు. నదుల అనుసంధానంపై కేంద్ర ప్రతిపాదనలమీదా సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై రాష్ట్రానికి మేలు జరిగేలా, వీలైనంత త్వరగా సాకారం అయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలపై నివేదిక తయారు చేయాలని సీఎం సూచించారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారులు సిద్ధం కావాలని ఆదేశించారు. కౌన్సిల్ సమావేశంలో ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఉంటే వాటిపై కూడా తగిన రీతిలో సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించారు.