Andhra Pradesh: ఐఏఎస్ కేడర్‌ నిబంధనల సవరణపై ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి..

Updated : 28 Jan 2022 23:16 IST

అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐఏఎస్‌ కేడర్‌ నిబంధనల సవరణకు తాము మద్దతిస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. రిజర్వ్‌ అధికారులను కేంద్రానికి పంపడం లేదన్న అంశంపై స్పందిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. డిప్యుటేషన్‌పై కేంద్రానికి పంపేందుకు సరిపడా అధికారులు ఏపీలో లేరని లేఖలో పేర్కొన్నారు. ఎక్కువ మంది అధికారులను రాష్ట్రానికి కేటాయిస్తే డిప్యుటేషన్‌పై పంపేందుకు ఇబ్బందులు ఉండవని అన్నారు. రాష్ట్రాల సమ్మతి లేకుండా డిప్యుటేషన్‌కి తీసుకెళ్లడంపై పునరాలోచించాలని కేంద్రాన్ని కోరారు.

డిప్యుటేషన్‌పై పంపే అధికారం రాష్ట్రాలకు ఉండటం మంచిదని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. ఐఏఎస్‌లు వివిధ పథకాలు, విభాగాల పర్యవేక్షణ హోదాలో ఉంటారనీ, అకస్మాత్తుగా రిలీవ్‌ చేయాల్సి వస్తే ప్రాజెక్టుల లక్ష్యాలు దెబ్బతింటాయని అన్నారు. అంతేకాకుండా ఐఏఎస్‌ల కుటుంబసభ్యులు, పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. ఇలాంటి సమస్యలు ఎదురైతే ఐఏఎస్‌ అధికారులు సరిగా పనిచేయలేకపోవచ్చని లేఖలో పేర్కొన్నారు. సర్వీసు రూల్స్‌ సవరణల ప్రతిపాదనలను పునరాలోచించుకోవాలని కోరారు. డిప్యుటేషన్‌కు పంపేలా ఐఏఎస్‌లను సిద్ధంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

కేంద్రం ప్రతిపాదనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏ ఐఏఎస్‌ అధికారినైనా డిప్యుటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. దీనిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ సవరణలను పలు రాష్ట్రాలు ఇప్పటికే వ్యతిరేకించాయి. పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఈ అంశంపై ప్రధానికి ఇప్పటికే లేఖలు రాశారు. మూడు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఇదే అంశంపై మోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని, నిబంధనల సవరణ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపాదిత సవరణలు రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని