
AP News: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: జగన్
అమరావతి: రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ సమీర్‌శర్మ, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కువ మంది కొవిడ్ బారిన పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రికాషన్ డోసు వేసుకునేందుకు ఉన్న వ్యవధి తగ్గించాలని కేంద్రాన్ని కోరాలని సీఎం జగన్ నిర్ణయించారు. ప్రికాషన్ డోసు 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. వ్యవధిని 3 నుంచి 4 నెలలకు తగ్గిస్తే ఫ్రంట్ లైన్ వర్కర్లకు, అత్యవసర సర్వీసులు అందిస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వైద్యపరంగా అవసరాలను గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
కొవిడ్ బాధితుల కోసం 53,184 పడకలు సిద్ధం..
వివిధ ప్రాంతాల్లో కొవిడ్ వ్యాప్తి తీరు సహా నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై సీఎంకు అధికారులు వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించగా.. అందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. అన్ని జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్రంలో ప్రస్తుతం 27వేల యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు వివరించారు. వీటిలో కేవలం 1100 మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో 600 మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరమని గుర్తించినట్టు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కొవిడ్ కేర్ సెంటర్ గుర్తించామని, వీటిలో సుమారు 28వేల బెడ్లను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు.
టెలిమెడిసిన్ ద్వారా వైద్యసేవలు అందించాలి
104 కాల్‌సెంటర్‌పైనా సీఎం సమీక్షించారు. కాల్‌సెంటర్ పటిష్టంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు. టెలిమెడిసిన్ ద్వారా కాల్ చేసిన వారికి వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద రోగులకు సమర్థవంతంగా సేవలందించాలని సీఎం నిర్దేశించారు. సేవల సమన్వయం కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యాప్ పనిచేయాలన్నారు. విలేజ్ క్లినిక్‌లలో శాశ్వతంగా హోర్డింగ్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు కావాల్సి వచ్చినప్పుడు ఎవరిని, ఎలా సంప్రదించాలనేది వీటిలో స్పష్టంగా తెలియాలన్నారు. విలేజ్ క్లినిక్‌లతో పాటు సచివాలయ, రైతు భరోసా కేంద్రాల్లో కూడా హోర్డింగ్ ఏర్పాటు చేయాలన్నారు. విలేజ్ క్లినిక్, పీహెచ్సీ, నెట్వర్క్ ఆసుపత్రి.. ఎక్కడకు వెళ్లినా వారి ఆరోగ్య పరిస్థితిని వెంటనే తెలుసుకుని వైద్యం కోసం ఎక్కడికి పంపాలనేది పటిష్టంగా ఉండాలన్నారు. 104, 108, పీహెచ్‌సీలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో ఉండే డాక్టర్లు ఈ ప్రక్రియలో భాగం కావాలని, రోగులకు మంచి సేవలు అందించేలా రిఫరెల్ విధానం పనిచేయాలన్నారు. వ్యాక్సినేషన్ ఉద్ధృతంగా చేపట్టి సత్వరమే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వ్యాక్సినేషన్లో వెనుకబడిన ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.