
Andhra news : సమ్మెకు వెళ్తామని తెలిసే బదిలీల ప్రకటన ఇచ్చారా?
విజయవాడ : ఏపీ వైద్యశాఖలో బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంపై వైద్యఉద్యోగుల సంఘం మండిపడింది. ఈ హడావిడి బదిలీలను వ్యతిరేకిస్తున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు తెలిపారు. పీఆర్సీపై వివిధ ఉద్యోగ సంఘాలు చేపడుతున్న సమ్మెలోకి వెళ్తామని తెలిసే బదిలీల ప్రకటన ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ బదిలీలు చేపట్టినా.. ఆన్లైన్లో కాకుండా మాన్యువల్‌గా చేపట్టాలని డిమాండ్ చేశారు. వైద్యశాఖలో ఉద్యోగుల బదిలీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే.
గతంలో బదిలీలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7లోగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఫిబ్రవరి 15లోగా తుది జాబితా సిద్ధం చేయాలని ఆదేశించింది. మార్చి 1 నుంచి వైద్యశాఖలో బదిలీలపై నిషేధం వర్తిస్తుందని వెల్లడించింది. ఫిబ్రవరి 28 నాటికి ఒకే చోట ఐదేళ్లు పూర్తి అయితే బదిలీ తప్పనిసరని పేర్కొంది. మూడు ఏళ్లుగా ఒకే చోట పని చేస్తోన్న ఉద్యోగులకు బదిలీ కోసం అభ్యర్థించే అవకాశం కల్పించారు. బదిలీ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.