Andhra news: సీఎస్‌తో ఉద్యోగసంఘాల భేటీ.. ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకారం

ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు వద్ద ఉంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు ఉద్యోగ సంఘాలు ఆమోదం తెలిపాయి. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్‌ జవహార్‌ రెడ్డితో సమావేశమై నిర్ణయించారు.

Published : 24 Mar 2023 22:30 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రాధానకార్యదర్శి జవహర్‌రెడ్డితో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం ముగిసింది. సచివాలయంలో దాదాపు 4 గంటలకుపైగా జరిగిన సమావేశంలో.. ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు, సూర్యనారాయణ, బండి, వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. కంట్రిబ్యూషన్‌ మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు వద్ద ఉంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. పీఆర్‌సీ పెండింగ్‌ అంశాలను త్వరలోనే పరిష్కరిస్తామని సీఎస్‌ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ గడవు 2024 వరకు పెంచాలని ఉద్యోగులు కోరారు. ఉద్యోగుల ప్రతిపాదన ఆర్థికశాఖ వద్ద ఉందని ప్రభుత్వం తెలిపింది. జీపీఎఫ్‌ రుణాలు, ఇతర బిల్లుల చెల్లింపులనూ క్రమపద్ధతితో చేస్తున్నామని వెల్లడించింది.

హెల్త్‌ కార్డులు, 11వ పీఆర్సీ పెండింగ్‌ అంశాలపై చర్చించినట్లు ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. నగదురహిత చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.పే స్కేల్‌ అంశాల గురించి సీఎస్‌ ఏమీ చెప్పలేదన్న ఆయన.. ఏపీజీఎల్‌ఐ 6 నెలలుగా జమ కాలేదని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. హెల్త్‌కార్డులకు వాటా చెల్లించినా ఉపయోగం లేదని ఎపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. వివిధ అంశాలపై అవగాహన కోసమే సమావేశం పెట్టారని ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. డీఏ, పీఆర్సీ బకాయిలను వేర్వేరుగా చూడాలని చెప్పారు. డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేసిన ఆయన.. వచ్చే నెల 5న సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

ఆరోగ్య పథకానికి కంట్రిబ్యూషన్‌ డబ్బు బదిలీ చేయాలని కోరినట్లు ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ‘‘ఈహెచ్‌ఎస్‌లో ఇబ్బందులకు 104 టోల్‌ఫ్రీలో ఆప్షన్‌ ఇస్తామన్నారు. హామీ మేరకు రూ.3 వేల కోట్లకుగానూ రూ.2,660 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఉద్యోగులు, ప్రభుత్వ వాటా 1,554 కోట్లు వారంలో ఇస్తామన్నారు. త్వరలోనే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలు చేస్తామన్నారు. పెండింగ్‌ డీఏలపై త్వరగా తేల్చాలని డిమాండ్‌ చేశాం.’’ అని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని