Andhra Pradesh : అడుగడుగునా నిర్బంధం.. ‘చలో విజయవాడ’పై తగ్గేదే లే: బొప్పరాజు

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గురువారం తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహించి తీరతామని పీఆర్సీ సాధన సమితి నేతలు

Updated : 02 Feb 2022 22:35 IST

విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గురువారం తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమంపై ఎంత నిర్బంధం ప్రయోగించినా నిర్వహించి తీరుతామని పీఆర్సీ సాధన సమితి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ స్పష్టం చేశారు. విజయవాడలో మీడియాతో పీఆర్సీ సాధన సమితి నేతలు బొప్పరాజు మాట్లాడుతూ.. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా తాము చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ‘చలో విజయవాడ’ భాగమని సీఎస్‌కు ఇప్పటికే చెప్పామన్నారు. ‘చలో విజయవాడ’ వాయిదా వేసుకోవాలని విజయవాడ సీపీ చెప్పారని పేర్కొన్నారు. అయితే గతంలోనే మా కార్యచరణను ప్రకటించామని వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలిపారు.

ఉద్యోగుల్ని అడ్డుకొనేందుకు పోలీసుల విశ్వప్రయత్నం..

మరోవైపు, పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రైళ్లు, బస్సుల్లో వెళ్తున్న ఉద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకొంటున్నారు. కృష్ణా జిల్లా వీరపల్లె వద్ద, గుంటూరు జిల్లాలోనూ విజయవాడ వస్తున్న ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్నారు. ఒంగోలులో ఎన్జీవో నేత శరత్‌ కుమార్‌ను గృహనిర్బంధం చేశారు. నెల్లూరులో ఉద్యోగులు రైతు వేషధారణలు, పల్లె ప్రజల్లాగా పోలీసులకు తెలియకుండా బస్సులు, రైళ్లలో బయల్దేరి విజయవాడకు చేరుకున్నారు. పోలీసుల తీరుపై పాడేరు ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పాడేరు నుంచి ప్రైవేటు బస్సులో వెళ్తున్న వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించగా.. కానీ, ఉద్యోగులు బృందాలుగా విడిపోయి విజయవాడ బయల్దేరారు.

ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రైళ్లు, బస్సుల్లో వెళ్తున్నవారిని సైతం ఎక్కడికక్కడ అడ్డుకొంటున్నారు.  ఉద్యోగుల కదలికలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే వివిధ మార్గాల్లో ఇప్పటికే పలువురు నాయకులు, ఉపాధ్యాయులు విజయవాడకు చేరుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 180 మంది ఉద్యోగ సంఘాల నేతలకు నోటీసులు జారీ చేశారు. విజయవాడ-జగదల్‌పూర్‌ హైవేపై ఐదు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. తిరువూరు నుంచి ఇబ్రహీంపట్నం వరకు చెక్‌పోస్టులు పెట్టారు.  కర్నూలులో చలో విజయవాడకు వెళ్లకుండా పోలీసులు కట్టడి చర్యలు తీసుకున్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులను గృహనిర్బంధాలు, అరెస్టుల చేస్తున్నారు. ఎమ్మిగనూరులో విజయవాడ బయల్దేరిన బస్సును పీఎస్‌కు తరలించారు. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఉపాధ్యాయులనూ పీఎస్‌కు తరలించడం గమనార్హం. 

జిల్లాల వారీగా నిర్బంధం ఇలా..

  • శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సుల్ని,  పలాస, సోంపేట, ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికుల్లో ఉద్యోగులు ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు. పాలకొండ పరిధిలో ముగ్గురు ఎన్జీవో నేతలను అరెస్టు చేసి విడుదల చేశారు.
  • విజయనగరం జిల్లాలో చలో విజయవాడకు వెళ్తున్న పలువురు ఉపాధ్యాయుల్ని అరెస్టు చేశారు. పార్వతీపురం, బొబ్బిలి రైల్వే స్టేషన్లలో పలువురిని అరెస్టు చేశారు.
  • విశాఖ నుంచి విజయవాడ వెళ్లకుండా ఉద్యోగులను పోలీసులు అడ్డుకొంటున్నారు. పాడేరు నుంచి వందల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు విశాఖ వచ్చారు.
  • అనంతపురం జిల్లా కదిరి రైల్వే స్టేషన్‌లో ఉద్యోగులను పోలీసులు అడ్డగించారు. ముళ్లచెట్లలో దాక్కుని ఒక్కసారిగా వచ్చి రైలు ఎక్కేందుకు ప్రయత్నం చేశారు. రైలు ఎక్కుతున్న వందమంది ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు.  పుట్టపర్తిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు నిరసన తెలిపారు. ఉరవకొండలో ఉపాధ్యాయ సంఘాల నేతలు అరెస్టయ్యారు. తాడిపత్రిరైల్వే స్టేషన్‌లో 30 మంది ఉపాధ్యాయులను ఓ ప్రత్యేక గదిలో నిర్బంధించారు.
  • కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అరెస్టయ్యారు. బనగానపల్లె నుంచి విజయవాడ వెళ్తుండగా ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదోని, డోన్‌, దేవనకొండ, ఎమ్మిగనూరులలో ఉద్యోగులను అరెస్టు చేశారు. అలాగే, నంద్యాలలో 60మంది ఉపాధ్యాయుల్ని అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల రైల్వే స్టేషన్‌లో భారీగా పోలీసులు మోహరించారు.
  • కడప జిల్లాలో పలువురు ఉపాధ్యాయులు, ఉద్యోగులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 121 మంది నాయకులకు నోటీసులు ఇచ్చారు. కడప ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.
  • విజయవాడ వెళ్లకుండా గుంటూరు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి ఉద్యోగులు రాకుండా కట్టడి చేస్తున్నారు. రెండు జాతీయ రహదారులు, ముఖ్యమైన మార్గాల్లో చెక్‌పస్టులు పెట్టారు. వినుకొండ మండలం విటంరాజు పల్లె, ఫిరంగిపురంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. చెన్నై-కోల్‌కతా హైవేపై యడ్లపాడు, పెదకాకాని వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలో వెయ్యి మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నోటీసులు జారీచేశారు. పలువురు ఉద్యోగ సంఘాల నేతలను గృహనిర్బంధం చేశారు.
  • ప్రకాశం జిల్లాలో 220 మంది ఉద్యోగ సంఘాల నేతలకు నోటీసులు ఇచ్చారు. ప్రధాన రహదారుల్లో 10 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలు ఇవ్వొద్దంటూ ట్రావెల్‌ ఏజెన్సీలకు హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా ఉద్యోగులు విజయవాడ చేరుకున్నారు.
  • కృష్ణా జిల్లాలో ఉద్యోగులకు పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గుడివాడ సబ్‌ డివిజన్‌ పరిధిలో 70 మందికి పైగా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ముందస్తు నోటీసులు జారీచేశారు.
  • పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్యోగులపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రతి మండల కేంద్రంలోనూ తనిఖీ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఏలూరు రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెదపాడు మండలం కలపర్రు టోల్‌ప్లాజా వద్ద హైవే పైనా తనిఖీలు చేస్తున్నారు. చలో విజయవాడ వెళ్లొద్దంటూ 180 మంది ఉద్యోగ సంఘాల నేతలకు నోటీసులు ఇచ్చారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు