AP Govt: ఏపీలో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఏపీలో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనికి సంబంధించిన ఫైల్‌పై మూడో సంతకం చేశారు.

Updated : 14 Jun 2024 15:30 IST

అమరావతి: ఏపీలో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనికి సంబంధించిన ఫైల్‌పై మూడో సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు అందుతున్న రూ.3 వేల పింఛన్‌ను ఒకేసారి రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం పింఛను పథకానికి పెట్టిన ‘ఎన్టీఆర్‌ భరోసా’ పేరునే ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు.

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పుకళాకారులు, హిజ్రాలు, హెచ్‌ఐవీ బాధితులు, కళాకారులకు ఇప్పటి వరకు అందుతున్న రూ.3 వేల పింఛన్‌ను పెంచి ఒకేసారి రూ.4 వేలు అందజేయనున్నారు. వీరికి ఏప్రిల్‌ నుంచే పెంపును అమలు చేయనున్నారు. అంటే జులై 1న పింఛను కింద వీరికి రూ.7 వేలు (జులై 1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్‌ నుంచి మూడు నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి) అందిస్తారు.

దివ్యాంగులకు ప్రస్తుతం అందుతున్న రూ.3 వేలను ఒకేసారి రూ.6 వేలకు పెంచారు. పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడినవారికి, వీల్‌ఛైర్‌లో ఉన్న వారికి అందే రూ.5 వేల పింఛను రూ.15 వేలకు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్‌ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛను కింద అందే రూ.5 వేలను రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కుష్ఠు కారణంగా బహుళ వైకల్యం సంభవించిన వారికి రూ.6 వేలు పింఛను ఇవ్వనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని