Andhra news: సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌.. ఉద్యోగ సంఘాల ముందు ఏపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన

ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్) రద్దు అంశంపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీని ఏర్పాటు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సీపీఎస్ అంశంపై చర్చించేందుకు సచివాలయంలో ఇవాళ జాయింట్‌...

Updated : 25 Apr 2022 19:34 IST

అమరావతి: ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్) రద్దు అంశంపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీని ఏర్పాటు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సీపీఎస్ అంశంపై చర్చించేందుకు సచివాలయంలో ఇవాళ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ఉన్నతాధికారులు, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉద్యోగ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశంలో సీపీఎస్‌ రద్దు అంశంపై ప్రధానంగా చర్చించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ నేతృత్వంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ కమిటీ సమావేశమై సీపీఎస్‌ రద్దు అంశంపై చర్చించనుంది. చర్చల అనంతరం ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పిస్తుంది.

ఉద్యోగ సంఘాల ముందు కొత్త ప్రతిపాదన..

రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌ స్థానంలో గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌) పేరిట కొత్త స్కీం తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. సీపీఎస్‌ బదులు జీపీఎస్‌ పథకం అమలు చేయాలని ప్రతిపాదన చేసింది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు స్పందిస్తూ.. ‘‘సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. జీపీఎస్‌పై ప్రభుత్వం పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చింది. పాత పెన్షన్‌ విధానమే కావాలని ప్రభుత్వాన్ని కోరాం. కొత్త స్కీంపై మేం అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పాం. జీపీఎస్‌ పేరిట కొత్త స్కీమ్‌ ఆమోదయోగ్యం కాదని చెప్పాం. కాగా, జీపీఎస్‌, సీపీఎస్‌కు తేడా ఏంటనే విషయాన్ని ప్రభుత్వం చెప్పలేదు. ప్రభుత్వం ఏదో విధంగా జీపీఎస్‌ తీసుకురావాలని చూస్తోంది. మేం జీపీఎస్‌ను ఒప్పుకోం’’ అని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని